Urvashi Rautela: ఊర్వశి రౌతెలా... ఈ మధ్య ఈమె ఏం చేసినా వార్తల్లో నిలుస్తుంది. ఈ బాలీవుడ నటి, క్రికెటర్ రిషభ్ పంత్ మధ్య ట్విట్టర్ వేదికగా పరోక్షంగా జరిగిన వార్ అప్పట్లో అందరికీ తెలిసిందే. ఆమె పంత్ ను ఉద్దేశించి ట్వీట్ చేయడం, దానికి రిషభ్ కూడా స్పందించడం లాంటివి అప్పట్లో జరిగాయి. తాజాగా మరోసారి ఊర్వశి రౌతెలా పంత్ విషయంలో వార్తల్లో నిలిచింది.
డిసెంబర్ 30న రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషభ్ పంత్ ప్రస్తుతం ముంబయిలోని కోకిలా బెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడు ఆ హాస్పిటల్ ఫొటోను ఊర్వశి రౌతేలా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఆ ఆసుపత్రి, దానికి సంబంధించిన మెడికల్ రీసెర్చి ఇన్ స్టిట్యూట్ చిత్రాన్ని షేర్ చేసింది. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీని గురించి నెటిజన్లు ఆమెపై విమర్శలు చేస్తున్నారు.
ఆమె పంత్ ను వెంబడిస్తోంది
ఊర్వశి చేసిన పోస్టుపై నెటిజన్లు స్పందిస్తూ... ఆమె పంత్ ను వెంబడిస్తోందని అంటున్నారు. 'ఇప్పుడామె తన డెంటిస్ట్ ను సందర్శించడానికి అక్కడికి వెళ్లినట్లు చెబుతుంది' అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. 'ఇది వేధింపు కాదా? ఇదే పని ఒక మహిళ పట్ల పురుషుడు చేస్తే అప్పుడేమంటారు' అని ఇంకో నెటిజన్ అన్నారు.
కోలుకోడానికి 6-9 నెలలు
గతేడాది డిసెంబర్ 30న రూర్కీ సమీపంలో రిషభ్ పంత్ తన కారు నడుపుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని నుదురు, వీపు, కాళ్లకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగాక డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ప్రస్తుతం పంత్ ను మెరుగైన వైద్యం కోసం ముంబయికి తరలించారు. అక్కడ అతడిని పరిశీలించిన వైద్యులు పంత్ పూర్తిగా కోలుకోవడానికి కనీసం 6 నుంచి 9 నెలలు పడుతుందని చెప్పారు. పూర్తిగా ఫిట్ నెస్ సాధించి మైదానంలో అడుగుపెట్డడానికి 9 నెలలైనా పడుతుందని అక్కడి వైద్యులు చెప్పినట్లు సమాచారం.
వరల్డ్ కప్ కు దూరం!
పంత్ కోలుకోవడానిక 9 నెలలు పడుతుందని వైద్యులు తెలిపారు. అంటే సుమారు అక్టోబర్ వరకు పంత్ మైదానంలో దిగలేడు. ఈ ఏడాది అక్టోబరులోనే భారత్ లో వన్డే ప్రపంచకప్ జరగనుంది. కాబట్టి పంత్ ఈ మెగా టోర్నీకి దూరమైనట్లే. ఇప్పటికే ఐపీఎల్, ఆసీస్ తో టెస్ట్ సిరీస్, ఆసియా కప్ - 2023కి రిషభ్ పంత్ అందుబాటులో ఉండడంలేదు.