Najam Sethi on Jay Shah:  ఈ ఏడాది పాకిస్థాన్ లో జరగబోయే ఆసియా కప్ లో భారత్ ఆడబోదంటూ కొన్నాళ్ల క్రితం బీసీసీఐ కార్యదర్శి జై షా వ్యాఖ్యలు చేశారు. దానిపై అప్పటి పీసీసీ చీఫ్ రమీజ్ రజా తీవ్రంగా స్పందించారు. టీమిండియా పాక్ లో ఆసియా కప్ ఆడకపోతే.. తాము కూడా భారత్ ఆతిథ్యమిచ్చే వన్డే ప్రపంచకప్ ఆడమంటూ వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో దీనిపై పెద్ద చర్చే జరిగింది. దాని తర్వాత ఇటీవల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ గా రమీజ్ తప్పుకున్నారు. 


 జైషా, రమీజ్ వ్యాఖ్యలతో భారత్- పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాజాగా జై షా చేసిన పని మళ్లీ ఈ రెండు దేశాల క్రికెట్ మధ్య చర్చనీయాంశంగా మారింది. అలాగే పీసీబీ కొత్త ఛైర్మన్ కూడా జైషా చేసిన పనిపై వ్యంగ్యంగా స్పందించారు. గత నెలలో పీసీబీ ఛైర్మన్ గా రమీజ్ రజాను తొలిగించాక కొత్త పాలకవర్గం ఏర్పడింది. నజమ్ సేథీ కొత్త ఛైర్మన్ గా ఎంపికయ్యారు. 14 మందితో మేనేజింగ్ కమిటీ ఏర్పడింది. 


మమ్మల్ని సంప్రదించరా!


బీసీసీఐ కార్యదర్శి జైషా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగానూ ఉన్నారు. ఆసియా కప్ 2023- 2024కు సంబంధించిన షెడ్యూల్ తో పాటు ఆసియా వేదికగా జరగబోయే అన్ని క్రికెట్ సిరీస్ లకు సంబంధించిన షెడ్యూల్ ను జైషా నిన్న విడుదల చేశారు. ఈ క్యాలెండర్ పై పీసీబీ ఛైర్మన్ నజమ్ సేథీ అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ఆసియా కప్ కు ఆతిథ్యమివ్వనున్న తమను సంప్రదించకుండా షెడ్యూల్ ను ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారని సేథీ ప్రశ్నించారు. దీనిపై ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. 


'ఏకపక్షంగా షెడ్యూల్ ను ప్రకటించినందుకు జైషాకు ధన్యవాదాలు. ఈ క్యాలెండర్ 2023- 2024 ఆసియా కప్ కు సంబంధించినది. మేం దానికి ఆతిథ్యమివ్వబోతున్నాం. అలాగే మా పీఎస్ ఎల్ కు సంబంధించిన క్యాలెండర్ ను కూడా మీరే విడుదల చేయండి.' అంటూ సేథీ వ్యంగ్యంగా స్పందించారు. జైషా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఆసియా కప్ లో భారత్- పాక్ ఒకే గ్రూపులో తలపడనున్నాయి.