Rishabh Pant Health:  రిషభ్ పంత్ ఇంకా భారత క్రికెట్ అభిమానులకు ఒక చేదువార్త. రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం కోలుకుంటున్న భారత క్రికెటర్ పంత్ ఇప్పటికే ఐపీఎల్ కు, ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కు దూరమయ్యాడు. ఇప్పుడు స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్ నకు కూడా పంత్ అందుబాటులో ఉండడని తెలుస్తోంది. 


గతేడాది డిసెంబర్ 30న రూర్కీ సమీపంలో రిషభ్ పంత్ తన కారు నడుపుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని నుదురు, వీపు, కాళ్లకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగాక డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ప్రస్తుతం పంత్ ను మెరుగైన వైద్యం కోసం ముంబయికి తరలించారు. అక్కడ అతడిని పరిశీలించిన వైద్యులు పంత్ పూర్తిగా కోలుకోవడానికి కనీసం 6 నుంచి 9 నెలలు పడుతుందని చెప్పారు. పూర్తిగా ఫిట్ నెస్ సాధించి మైదానంలో అడుగుపెట్డడానికి 9 నెలలైనా పడుతుందని అక్కడి వైద్యులు చెప్పినట్లు సమాచారం. 


కనీసం 9 నెలలు పడుతుంది


పంత్ ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. మెరుగైన వైద్యం కోసం మ్యాక్స్ ఆసుపత్రి నుంచి పంత్ ను ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ స్పోర్ట్స్ ఆర్థోపెడిక్ డైరెక్టర్ డాక్టర్ దిన్షా పార్దివాలా వైద్యుల బృందం పంత్ ను పరీక్షించింది. 'వాపు తగ్గే వరకు ఎంఆర్ ఐ స్కాన్, లేదా ఏ శస్త్రచికిత్స చేయలేం. పంత్ కు మోకాలి లిగమెంట్ లో తీవ్రమైన చీలిక ఉంది. అతను పూర్తిగా కోలుకుని సాధారణ క్రికెట్ శిక్షణకు వెళ్లడానికి కనీసం 8-9 నెలల సమయం పడుతుంది.' అని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. 'ఈ దశలో చీలిక ఏ స్థాయిలో ఉందో తెలియదు. దీనిపై తదుపరి 3-4 రోజుల్లో స్పష్టత రావచ్చు. అయితే స్నాయువులో చీలిక తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. పంత్ వికెట్ కీపర్. కనుక అతడిపై పడే పనిభారం చూసుకుంటే మరో 6-9 నెలల తర్వాత మాత్రమే పోటీ క్రికెట్ ఆడే అవకాశం ఉంది.' అని బీసీసీఐ వైద్య బృందానికి చెందిన సన్నిహిత వర్గాలు తెలిపాయి. 


అయితే దీనిపై బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. 'మేం పంత్ ను సాధ్యమైనంత బాగా చూసుకుంటాం. అయితే ఈ దశలో అతని గాయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేం. ఒకవేళ అలా చేస్తే అవి ఊహాగానాలు అవుతాయి. వైద్యులను వారి విధానాలు, పరిశీలనలు చేయనివ్వంది. వారు చెప్పిన తర్వాతే మేం అతని గాయంపై ఏదైనా స్పందించగలం' అని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ వ్యాఖ్యానించారు. 


వరల్డ్ కప్ కు దూరం!


పంత్ కోలుకోవడానిక 9 నెలలు పడుతుందని వైద్యులు తెలిపారు. అంటే సుమారు అక్టోబర్ వరకు పంత్ మైదానంలో దిగలేడు.  ఈ ఏడాది అక్టోబరులోనే భారత్ లో వన్డే ప్రపంచకప్ జరగనుంది. కాబట్టి పంత్ ఈ మెగా టోర్నీకి దూరమైనట్లే. ఇప్పటికే ఐపీఎల్, ఆసీస్ తో టెస్ట్ సిరీస్, ఆసియా కప్ - 2023కి రిషభ్ పంత్ అందుబాటులో ఉండడంలేదు.