IND vs SL 2ND T20: ప్రాథమిక అంశాలలో తప్పులు చేయడంవల్లే శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో తాము ఓడిపోయినట్లు.. భారత కెప్టెన్ హార్దిక్ పాండ్య అన్నాడు. గురువారం జరిగిన మ్యాచులో శ్రీలంక చేతిలో 16 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలయ్యింది. దీనిపై హార్దిక్ మాట్లాడాడు.
వాటివల్లే మ్యాచ్ చేజారింది
'బౌలింగ్, బ్యాటింగ్, పవర్ ప్లే ఓవర్లు మాకు నష్టం కలిగించాయి. మేం ఈ స్థాయిలో చేయకూడని ప్రాథమిక తప్పులు చేశాం. అయితే వాటి నుంచి నేర్చుకోవడం అనేది మన చేతిలో ఉంటుంది. ఏ మ్యాచులోనూ ప్రాథమిక విషయాల నుంచి దూరంగా వెళ్లకూడదు. ఆటలో నో బాల్స్ వేయడమనేది సాధారణం. అది నేరం కాదు. ఈ తప్పుల నుంచి పాఠం నేర్చుకుని వచ్చే మ్యాచులో గెలిచేందుకు ప్రయత్నిస్తాం' అని హార్దిక్ చెప్పాడు. అలానే సూర్య ఇన్నింగ్స్ గురించి హార్దిక్ మెచ్చుకున్నాడు. 'అతను నాలుగో స్థానంలో అద్భుతంగా పరుగులు సాధించాడు. జట్టులోకి వచ్చే ఎవరికైనా వారు సౌకర్యంగా ఉండే స్థానంలో ఆడించాలనుకుంటున్నాం' అని రాహుల్ త్రిపాఠిని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.
భారత్‌తో జరిగిన రెండో టీ20లో శ్రీలంక 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 190 పరుగులకు పరిమితం అయింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను శ్రీలంక 1-1తో సమం చేశారు.
శ్రీలంక కెప్టెన్ దసున్ శనక (22 బంతుల్లో 56) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే ఆ జట్టు బ్యాటర్లు పాతుమ్ నిశ్సాంక (33), కుశాల్ మెండిస్ (52) జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించారు. ఛేదనలో భారత టపార్డర్ ఘోరంగా విఫలమైంది. ఓపెనర్లు శుభ్ మన్ గిల్ (5), ఇషాన్ కిషన్ (5), అరంగేట్ర ఆటగాడు రాహుల్ త్రిపాఠి (5) తీవ్రంగా విఫలమయ్యారు. అయితే సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 51), అక్షర్ పటేల్ (31 బంతుల్లో 65) జట్టును గెలిపించడానికి విఫలయత్నం చేశారు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 42 బంతుల్లోనే 91 పరుగులు చేశారు. అయితే కీలక సమయంలో సూర్య ఔట్ కావడం, లక్ష్యం పెద్దదిగా ఉండటంతో గెలుపు సాధ్యంకాలేదు.