Sanju Samson:  శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్ కు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే తొలి టీ20 లో గాయపడి సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. దీనిపై సంజూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. ఆల్ ఈజ్ వెల్. సీ యూ సూన్ (అంతా బాగానే ఉంది. త్వరలో కలుద్దాం) అని రాసి పోస్ట్ చేశాడు.   


శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో సంజూ శాంసన్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే బ్యాటింగ్ లో సంజూ విఫలమయ్యాడు. కేవలం 5 పరుగులే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత ఫీల్డింగ్ లోనూ ఒక క్యాచ్ జారవిడిచాడు. ఈ క్రమంలోనే సంజూ గాయపడ్డాడు. బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేసినప్పుడు శాంసన్ బంతిని ఆపే క్రమంలో అతని మోకాలికి గాయమైంది. దీనిపై బీసీసీఐ స్పందించింది. స్కాన్ కోసం అతన్ని పంపించాం. స్పెషలిస్ట్ అభిప్రాయం ప్రకారం సంజూకు విశ్రాంతి అవసరం. అని తెలిపింది. 


సంజూ శాంసన్ స్థానంలో జితేష్


గాయపడి సిరీస్ మొత్తానికి దూరమైన సంజూ శాంసన్ స్థానంలో అన్ క్యాప్ డ్ ప్లేయర్ జితేష్ శర్మను బీసీసీఐ ఎంపిక చేసింది. దేశవాళీ క్రికెట్లో జితేశ్‌ శర్మకు మంచి అనుభవం ఉంది. ప్రస్తుతం విదర్భకు వికెట్‌ కీపిర్ బ్యాటర్ గా ఉన్నాడు. మిడిలార్డర్లో వచ్చి బంతిని బలంగా బాదగలడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో పంజాబ్‌ కింగ్స్‌ తరఫున ఆడాడు. ఐపీఎల్‌లో విధ్వంసాలు సృష్టించడంతో సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. అరంగేట్ర మ్యాచుల్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై 17 బంతుల్లోనే 26 బాదేసి ఔరా అనిపించాడు. 12 మ్యాచులాడి 10 ఇన్నింగ్సుల్లో 234 పరుగులు సాధించాడు. దిల్లీ క్యాపిటల్స్‌పై చేసిన 44 (34 బంతుల్లో) టాప్‌ స్కోర్‌.  ఇప్పటికే రిషభ్ పంత్‌, కేఎల్‌ రాహుల్‌ టీ20 జట్టులో లేకపోవడంతో జితేశ్‌కు అవకాశం దక్కింది. పైగా 5, 6 స్థానాల్లో వచ్చి హిట్టింగ్‌ చేయగల సామర్థ్యం ఉంది.