Salman Butt on Umran Malik:  ఉమ్రాన్ మాలిక్... ఇప్పుడు భారత క్రికెట్ లో ఎక్కువగా చర్చించుకుంటున్న పేస్ బౌలర్. దాదాపు 150 కి.మీ. వేగంతో బంతిని సంధించగల ఉమ్రాన్ ఇప్పుడిప్పుడే టీ20 ఫార్మాట్ లో జట్టులో కుదురుకుంటున్నాడు. అరంగేట్రం చేసిన మొదట్లో ఎక్కువగా వేగం మీదే దృష్టి పెట్టిన ఈ జమ్మూ కశ్మీర్ పేసర్.. ఇప్పుడు మంచి పేస్ తో వికెట్లు రాబడుతున్నాడు. ప్రతి మ్యాచ్ లో నిలకడగా వికెట్లు తీస్తూ టీమిండియాకు కీలక ఫాస్ట్ బౌలర్ గా మారుతున్నాడు. 


ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్ లోనూ ఉమ్రాన్ మాలిక్ ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే 2 మ్యాచుల్లో 5 వికెట్లు పడగొట్టాడు. మొదటి మ్యాచులో 2, రెండో టీ20లో 3 వికెట్లు తీశాడు. మొదటి టీ20లో లంక జట్టు కెప్టెన్ దసున్ శనకను 155 కి.మీ. వేగవంతమైన బంతితో ఉమ్రాన్ ఔట్ చేసిన తీరు చూసి తీరాల్సిందే. ఇక రెండో టీ20లో అతడు 3 వికెట్లు తీసి 48 పరుగులు ఇచ్చాడు. అయితే వికెట్లు తీస్తున్నప్పటికీ ధారాళంగా పరుగులివ్వడం ఉమ్రాన్ కు మైనస్ గా మారింది. అలాగే అతడి అనుభవలేమిని ఉపయోగించుకుని బ్యాటర్లు పరుగులు రాబడుతున్నారు. దీని గురించే పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ మాట్లాడాడు. 


అనుభవంతో మెరుగవుతాడు


ఉమ్రాన్ ప్రదర్శనపై సల్మాన్ భట్ మాట్లాడుతూ... అతను అనుభవంతో నేర్చుకుంటాడని అన్నాడు. అలాగే అతని బౌలింగ్ లో కొన్ని లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పాడు. 'ఉమ్రాన్ అనుభవంతో మెరుగవుతాడు. మంచి వేగం, యాక్షన్ ఉన్నప్పటికీ అనుభవలేమితోనే ఎక్కువ పరుగులు ఇస్తున్నాడు. బ్యాటర్ అనుభవజ్ఞుడైతే ఉమ్రాన్ వేగాన్ని బాగా ఉపయోగించుకుంటాడు. అతని బౌలింగ్ ను తేలికగా ఊహించవచ్చు. ఎందుకంటే అతను యార్కర్లు, స్లోయర్ డెలీవరీలు వేయడు' అని సల్మాన్ వివరించాడు.


ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి 


అలాగే ఉమ్రాన్ మాలిక్ కు వీలైనన్ని ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని సల్మాన్ భట్ అభిప్రాయపడ్డాడు. అతను ఎంత ఎక్కువ ఆడితే అంత నేర్చుకుంటాడని అన్నాడు. 'బ్యాట్స్ మెన్ రూమ్ సృష్టించుకుంటున్నప్పుడు ఆఫ్ స్టంప్ ఆవల యార్కర్లు వేయాలి. కానీ ఉమ్రాన్ అలా వేయడంలేదు. ఇది అనుభవంతో వస్తుంది. కాబట్టి ఉమ్రాన్ కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. ఎందుకంటే అతను వికెట్లు తీయగలడు. అలాగే కష్టమైన పరిస్థితుల నుంచి మ్యాచ్ లను గెలిపించగల సత్తా అతనికుంది' అని సల్మాన్ భట్ చెప్పాడు. 


నేడు సిరీస్ డిసైడర్ మ్యాచ్


ఈరోజు శ్రీలంకతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. సిరీస్ విజేతను నిర్ణయించే మ్యాచులో రాజ్ కోట్ వేదికగా శ్రీలంకతో చివరి టీ20 ఆడనుంది. 2019 నుంచి ఇప్పటివరకు భారత్ సొంతగడ్డపై టీ20 సిరీస్ కోల్పోలేదు. వరుసగా 13 సిరీస్ లను చేజిక్కించుకుంది. మరి హార్దిక్ పాండ్య నేతృత్వంలోని భారత జట్టు ఆ జైత్రయాత్రను కొనసాగిస్తుందో లేదో నేడు తేలనుంది.