IND vs SL 3rd T20 Preview:


టీ20 ఫార్మాట్లో లంకేయులపై టీమ్‌ఇండియాది అప్రతిహత జైత్రయాత్ర! అలాంటిది తొలిసారి సిరీస్‌ చేజార్చుకొనే సిచ్యువేషన్లో అల్లాడుతోంది. ఇప్పటికే సిరీస్‌ 1-1తో సమం కావడంతో రాజ్‌ కోట్‌లో తాడోపేడో తేల్చుకోనుంది. అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లో తడబడుతున్న హార్దిక్‌ సేన ఆఖరి టీ20 గెలిస్తేనే పరువు నిలబడుతుంది. మరోవైపు భారత్‌పై తొలి సిరీస్‌ గెలవాలని శ్రీలంక తహతహలాడుతోంది. మరి గెలుపు తలుపు ఎవరు తడుతారో చూడాలి!


లంకేయులకే ఎడ్జ్‌!


సొంతగడ్డపై పొట్టి ఫార్మాట్లో టీమ్‌ఇండియాకు తిరుగులేదు. 2019లో ఆసీస్‌ చేతిలో 2-0తో ఓటమి పాలయ్యాక వరుసగా 11 సిరీసులు గెలిచింది. అలాంటిది మళ్లీ ఇప్పుడు భయం అంచున నిలబడింది. ఒకవేళ పరాజయం చవిచూస్తే లంకేయులకు ఆరు ప్రయత్నాల్లో తొలి సిరీస్‌ దక్కుతుంది. ఈ సిరీసులో దసున్‌ శనక జట్టు తెలివిగా ఆడుతోంది. బ్యాటింగ్‌లో ఎవరో ఇద్దరు నిలుస్తూనే ఉన్నారు. రెండో టీ20లో ఫస్టాఫ్‌ కుశాల్‌ మెండిస్‌ బాదేస్తే సెకండాఫ్‌లో శనక వీరంగం ప్రదర్శించాడు. బౌలింగ్‌లో వనిందు హసరం, మహీశ్‌ థీక్షణ రెచ్చిపోతున్నారు. వారికి ఫాస్ట్‌ బౌలర్లు అండగా నిలిస్తే పుణెలో సీనే రిపీట్‌ అవ్వుద్ది.


కొత్తజట్టు నిలకడ లేమి!


భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని టీమ్‌ఇండియా కుర్రాళ్లతో ప్రయోగాలు చేస్తోంది. టాప్‌ ఆర్డర్‌ రాణించకపోవడం ఇబ్బంది పెడుతోంది. ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్‌, రాహుల్‌ త్రిపాఠి, సంజూ శాంసన్‌ ప్రభావం చూపలేదు. దాంతో తొలి టీ20లో అక్షర్ పటేల్‌ దీపక్‌ హుడా, రెండో టీ20లో అక్షర్‌, సూర్యకుమార్‌ శ్రమించాల్సి వచ్చింది. హార్దిక్‌ పాండ్య తన స్థాయి మేరకు సత్తా చాటలేదు. కఠిన పరిస్థితులకు అలవాటు పడేందుకే ఇలా చేస్తున్నామని అతడు చెబుతున్నాడు. అర్షదీప్‌ తన పాత సమస్యతోనే బాధపడటం టీమ్‌ఇండియా కొంప ముంచుతోంది. 2 ఓవర్లలోనే 5 నోబాల్స్‌ వేయడంతో 37 పరుగులు ఊరికే వచ్చాయి. అతడెంత త్వరగా సమస్య నుంచి బయటపడితే అంత మంచింది. శివమ్‌ మావి ఆకట్టుకుంటున్నాడు. స్పిన్‌తో ఇబ్బందేమీ లేదు.


పరుగుల వరదే!


రాజ్‌కోట్‌ పిచ్‌ జాతీయ రహదారికి సమీపంలో ఉంటుంది. అంటే మరో రన్‌ ఫెస్ట్‌ ఖాయమే! టాస్‌ గెలిచిన జట్లు తొలుత బ్యాటింగ్‌ తీసుకోవడం బెటర్‌. ఛేదన జట్లకే పిచ్‌ కలిసొస్తుంది. వాతావరణం చల్లగా ఉంటుంది.


తుది జట్లు (అంచనా)


భారత్‌: ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్‌ గిల్‌, రాహుల్‌ త్రిపాఠి, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య, దీపక్‌ హుడా, అక్షర్‌ పటేల్‌, శివమ్‌ మావి, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్షదీప్‌ సింగ్‌, యుజ్వేంద్ర చాహల్‌


శ్రీలంక: పాథుమ్‌ నిసాంక, కుశాల్‌ మెండిస్‌, ధనంజయ డిసిల్వా, చరిత్‌ అసలంక, సదీర సమరవిక్రమ / భానుక రాజపక్స, దసున్ శనక, వనిందు హసరంగ, చామిక కరుణరత్నె, మహీశ్ థీక్షణ, కసున్‌ రజిత, దిల్షాన్‌ మదుశనక