Rishabh Pant Health:
టీమ్‌ఇండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు శస్త్రచికిత్స జరిగింది. ముంబయిలోని ఆస్పత్రిలోనే అతడి మోకాలి లిగమెంట్లకు శస్త్రచికిత్స చేయించినట్టు బీసీసీఐ వర్గాలు ద్వారా తెలిసింది. డాక్టర్ దిన్షా పార్ధీవాలా నేతృత్వంలోని వైద్యబృందం పంత్ రిహాబిలిటేషన్ వ్యవహారాలు చూసుకోనుంది.
'రిషభ్ పంత్ మోకాలి లిగమెంట్ల శస్త్రచికిత్స శుక్రవారం విజయవంతమైంది. ప్రస్తుతం అతడిని పరిశీలనలో ఉంచారు. మున్ముందు ఏం చేయాలో, రిహాబిలిటేషన్‌కు ఎప్పుడు పంపించాలో డాక్టర్ దిన్షా పార్ధీవాలా నేతృత్వంలోని వైద్యబృందం సూచిస్తుంది. బీసీసీఐ స్పోర్ట్స్ సైన్స్, మెడిసిన్ టీమ్ వారితో సమన్వయం చేసుకుంటుంది' అని బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు. కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగింది.
కారు ప్రమాదంలో గాయాలు
రూర్కీ ప్రమాదంలో రిషభ్ పంత్ గాయపడ్డ సంగతి తెలిసిందే. తలకు రెండు గాట్లతో పాటు మోకాలిలోని లిగమెంట్లలో చీలిక వచ్చింది. వీటి నుంచి పూర్తిగా కోలుకొనేందుకు కనీసం తొమ్మిది నెలలు పడుతుందని వైద్యులు అంచనా వేస్తున్నారు. డెహ్రాడూన్‌లో అతడిని పరామర్శించేందుకు ఎక్కువ మంది వస్తున్నారు. వారిని నియంత్రించేందుకు వీలవ్వడం లేదు. పంత్‌కు విశ్రాంతి తీసుకోవడం కుదరడం లేదు. ఈ నేపథ్యంలోనే ముంబయిలోని కోకిలా బెన్ ఆస్పత్రికి అతడిని ఎయిర్‌లిఫ్ట్ చేయడం గమనార్హం. కాస్త కోలుకున్న తర్వాత డబుల్ సర్జరీ కోసం అతడిని లండన్ తీసుకెళ్తారని వార్తలు వచ్చినా ముంబయిలోనే శస్త్రచికిత్స చేశారు.
వరల్డ్ కప్ కు దూరం!
పంత్ కోలుకోవడానిక 9 నెలలు పడుతుందని వైద్యులు తెలిపారు. అంటే సుమారు అక్టోబర్ వరకు పంత్ మైదానంలో దిగలేడు. ఈ ఏడాది అక్టోబరులోనే భారత్ లో వన్డే ప్రపంచకప్ జరగనుంది. కాబట్టి పంత్ ఈ మెగా టోర్నీకి దూరమైనట్లే. ఇప్పటికే ఐపీఎల్, ఆసీస్ తో టెస్ట్ సిరీస్, ఆసియా కప్ - 2023కి రిషభ్ పంత్ అందుబాటులో ఉండడంలేదు.