U19 World Cup 2024 Super Six: అండర్ 19 ప్రపంచకప్(U19 World Cup 2024)లో భారత(Team India) జైత్రయాత్ర కొనసాగుతోంది. గ్రూప్ దశలో విజయపరంపర కొనసాగించిన యువ భారత్... సూపర్ సిక్స్(Super Six)లోనూ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. గ్రూప్ స్టేజ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ విజయాలు సొంతం చేసుకున్న భారత్.. తాజాగా కివీస్‌తో జరిగిన సూపర్ సిక్స్ పోరులోనూ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ముషీర్ ఖాన్(Musheer Khan) భారీ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 295 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్(New Zealand) 81 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా యువ భారత్.. 214 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. భారత బౌలర్లలో సౌమి పాండే 4 వికెట్లు తీశాడు. ఛేదనలో కివీస్ బ్యాటర్లు ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కును చేరుకోలేదు. కెప్టెన్ ఆస్కార్ జాక్సన్ 19 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కివీస్ జట్టులో నలుగురు బ్యాటర్లు సున్నా పరుగులకే పరిమితమవగా ముగ్గురు సింగిల్ డిజిట్ స్కోరు చేశారు.
ముషీర్ ఖాన్ జోరు
బ్లూమ్‌ఫోంటైన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 295 పరుగులు సాధించింది. ఈ టోర్నీలో అద్భుత ఫామ్‌లో ఉన్న ముషీర్ ఖాన్ 126 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 131 పరుగులు చేశాడు. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (58), కెప్టెన్ ఉదయ్ సహరన్ (34) లు రాణించడంతో కివీస్ ముందు భారీ లక్ష్యాన్ని నిలిపింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన భారత్ ఐదో ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. వన్ డౌన్‌గా వచ్చిన ముషీర్.. ఆదర్శ్‌తో రెండో వికెట్‌కు 77 పరుగులు జోడించాడు. ఆ తర్వాత కెప్టెన్ ఉదయ్‌తోనూ మూడో వికెట్‌కు 87 రన్స్ జత చేశాడు. 109 బంతుల్లో సెంచరీ పూర్తిచేసుకున్న ముషీర్ ఆ తర్వాత బ్యాట్ ఝుళిపించాడు. ఈ టోర్నీలో అతడికి ఇది రెండో శతకం. ఈ టోర్నీలో మరో శతకం చేస్తే ముషీర్.. 2004లో శిఖర్ ధావన్ పేరిట ఉన్న మూడు సెంచరీల రికార్డును సమం చేస్తాడు.
కివీస్ విలవిల
భారత బౌలర్ల ధాటికి కివీస్ విలవిలలాడింది. కివీస్‌ను ఆది నుంచే భారత బౌలర్లు దెబ్బతీశారు. నమన్ తివారి, రాజ్ లింబాని పేస్‌తో కివీస్‌ను కోలుకోనీయకుండా చేశారు. ఆ తర్వాత స్పిన్నర్ సౌమి పాండే.. పది ఓవర్లు వేసి రెండు మెయిడిన్లతో 19 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన ముషీర్ ఖాన్.. బౌలింగ్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో భారత్ సూపర్ సిక్స్ స్టేజ్‌లో ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను ఫిబ్రవరి 2న నేపాల్‌తో ఆడనుంది.
ఆరో తేదీన సెమీ ఫైనల్
సూపర్ సిక్స్‌లో టాప్‌లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టనున్నాయి. ఫిబ్రవరి ఆరో తేదీన తొలి సెమీ ఫైనల్ జరగనుంది. ఎనిమిదో తేదీన రెండో సెమీఫైనల్, ఫైనల్ ఫిబ్రవరి 11న జరగనుంది. ఇందుకోసం క్రికెట్ దక్షిణఫ్రికా ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 19న ప్రారంభమైన అండర్-19 వరల్డ్ కప్ మ్యాచ్‌లు.. వచ్చే నెల 11తో ముగియనున్నాయి. ఇకపతే, టైటిట్ పేవరెట్స్‌గా బరిలోకి దిగిన భారత్, ఆస్ర్టేలియా జట్లు అంచనాలకు మించి రాణిస్తుండగా, హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజీతో దక్షిణాఫ్రికా కూడా మెరుగైన ప్రదర్శనతో అదరగొడుతోంది. ఇంగ్లాండ్, శ్రీలంక, పాకిస్థాన్ జట్టు కూడా అంచనాలకు మించి రాణిస్తూ టైటిల్ రేసులో కొనసాగుతున్నాయి.