U19 World Cup 2024 Final Australia Beats India: దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచ కప్( U19 World Cup Final 2024)లోనూ కుర్రాళ్లకు నిరాశే ఎదురైంది. నవంబర్ 19, 2023న వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టీమ్‌ఇండియాను ఆస్ట్రేలియా ఓడించింది. ఆదివారం ఫైనల్లో కుర్రాళ్లు ప్రతీకారం తీర్చుకుంటారని అంతా భావించారు.. కానీ ఆసీస్ విజయం సాధించి మరో ట్రోఫీని ముద్దాడింది.
254 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 43.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో ఆస్ట్రేలియా కుర్రాళ్లు నాలుగోసారి అండర్ 19 వరల్డ్ కప్ కైవసం చేసుకున్నారు. సీనియర్లు ఎలాగైతే తుది మెట్టుపై కంగారు పడ్డారో, సరిగ్గా అదే తీరుగా భారత కుర్రాళ్లను ఆస్ట్రేలియా ఆటగాళ్లు కంగారు పెట్టారు. ఆసీస్ బౌలర్లలో బార్డ్‌మాన్, మెక్ మిలన్ చెరో 3 వికెట్లు పడగొట్టగా, విడ్లర్ 2 వికెట్లు తీశాడు.
ఆదిలోనే ఎదురుదెబ్బ, టాపార్డర్ విపలం..
ఆస్ట్రేలియా నిర్దేశించిన 254 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్‌కు దిగిన యువ భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. టీమ్ స్కోరు 3 రన్స్ వద్ద ఓపెనర్ కులకర్ణి (3) ఔటయ్యాడు. కల్లమ్ విడ్లర్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. మరో 10 ఓవర్ల వికెట్ పడకుండా ఆదర్శ్ సింగ్, సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ (22 రన్స్) జాగ్రత్తపడ్డారు. బార్డ్‌మన్ బౌలింగ్ లో అతడే క్యాచ్ పట్టడంతో ముషీర్ ఖాన్ ఔటయ్యాడు. వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణించిన కెప్టెన్ ఉదయ్ శరణ్ ఫైనల్లో విఫలమయ్యాడు. 8 పరుగులకే నిష్క్రమించాడు. టోర్నీలో టాప్ 3 స్కోరర్లుగా ఉన్న భారత కుర్రాళ్లు ఫైనల్లో స్కోరు బోర్డును నడిపించేందుకు ఇబ్బంది పడ్డారు.
Photo: Twitter/ICC
సచిన్ దాస్ (9), ప్రియాన్షు మోలియా (9), అవినాష్ (0) ఔట్ కావడంతో 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాలో పడింది. స్కోరు బోర్డును నడిపించే క్రమంలో ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (47; 77 బంతుల్లో 4x4, 1x6) ఔటయ్యాడు. చివర్లో మురుగన్ అభిషేక్ (42; 46 బంతుల్లో 5x4, 1x6) రాణించడంతో ఓటమి అంతరం తగ్గింది. విడ్లర్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. ఆసీస్ కెప్టెన్ హ్యూ వీబ్జెన్ క్యాచ్ పట్టడంతో నిరాశగా వెనుదిరిగాడు. పాండే(2)ను స్ట్రీకర్ ఔట్ చేసి భారత ఇన్నింగ్స్‌ను ముగించడంతో 79 రన్స్ తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. అండర్ 19 వరల్డ్ కప్ ట్రోఫీని మరోసారి కైవసం చేసుకుంది.
టాస్ నెగ్గిన ఆసీస్, ఫస్ట్ బ్యాటింగ్..
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా గౌరవ ప్రదమైన స్కోర్ సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్ లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. హర్జాస్ సింగ్(55 ) , హ్యూ వీబ్జెన్ (48) , డిక్సన్ (42) ఓలివర్ (46) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో రాజ్ లింబానీ (3) వికెట్లు పడగొట్టగా, నమన్ తివారీ( 2) వికెట్లు తీశాడు.
ఓవరాల్‌గా ఇప్పటివరకూ భారత్ 9సార్లు అండర్-19 ప్రపంచకప్ ఫైనల్స్ ఆడగా.. 2000, 2008, 2012, 2018, 2022లో మొత్తం 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఇంతకు ముందు 2006, 2016, 2020లలో ఫైనల్లో ఓటమిపాలైంది. తాజాగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లోనూ డిఫెండింగ్ ఛాంపియన్ యువ భారత్ తుది మెట్టుపై బోల్తాపడింది. అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా, భారత్ జట్లు ఇప్పటివరకు 4 సార్లు తలపడగా.. చెరో రెండు ఫైనల్స్ నెగ్గి మెగా ట్రోఫీని అందుకున్నాయి.