IND vs AUS  Under 19 World Cup 2024: అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ లో ఆస్ట్రేలియా గౌరవ ప్రదమైన స్కోర్ సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్ లలో  7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. హర్జాస్ సింగ్(55 ) , హ్యూ వీబ్జెన్ (48) , డిక్సన్ (42) ఓలివర్ (46) పరుగులతో రాణించారు. భారత  బౌలర్లలో  రాజ్ లింబానీ (3) , నమన్ తివారీ( 2) వికెట్లు  తీశారు . పటిష్ట బౌలింగ్  కలిగిన భారత్ కు ఈ లక్ష్య ఛేదన పెద్ద కష్టం  కాబోదు. కానీ సత్తా ఉన్న ఆస్ట్రేలియా బౌలింగ్ను తట్టుకొని  టీం ఇండియా బ్యాటర్ లు ఈ లక్ష్యాన్ని ఛేదిస్తారా లేదా అన్నది చూడాల్సిందే. 


ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా జ‌రుగుతున్న అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్( U19 World Cup Final 2024) ఆఖ‌రి అంకానికి చేరుకుంది.  బెనోనిలో విల్లోమూర్ పార్క్‌లో అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. గత ఏడాది నవంబర్ 19న భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో భారత అభిమానులను ఆస్ట్రేలియా కన్నీరు పెట్టించింది. అయితే ఈ కన్నీళ్లకు బదులు తీర్చుకునేందుకు యువ భారత్‌ సిద్ధమైంది.


అండర్ 19 ప్రపంచకప్‌లో రెండు జట్లు ఇప్పటివరకు 3 సార్లు తలపడ్డాయి. రెండు సార్లు  కంగారులను ఓడించి ట్రోఫిని ముద్దాడిన భారత్ ఒకసారి మాత్రం ఓడిపోయింది.  ఇప్పుడు 2024లో విజయం సాధించి వరుసగా రెండోసారి కప్పును గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించాలని టీమిండియా చూస్తోంది. 


డిఫెండింగ్ చాంపియ‌న్‌గా టోర్నీలో అడుగుపెట్టిన భార‌త్ లీగ్ ద‌శ‌లో ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. ప్రస్తుతానికి  యువ భారత్‌ అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ నిలకడగా రాణిస్తోంది. కెప్టెన్‌ ఉదయ్‌ సహారన్‌ ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. నాయకత్వ లక్షణాలతో పాటు బ్యాటింగ్‌లోనూ అదరగొడుతున్నాడు. సచిన్‌ దాస్‌ కూడా ఉత్తమ ఫామ్‌ కొనసాగిస్తున్నాడు. సర్ఫరాజ్‌ ఖాన్‌ సోదరుడు ముషీర్‌ ఖాన్‌ పరుగుల వేట కొనసాగిస్తున్నాడు. దాంతో, వ‌రుసగా రెండో సారి ట్రోఫీ గెల‌వాల‌నే క‌సితో ఉంది. ఆస్ట్రేలియా కూడా అజేయంగా ఫైన‌ల్‌కు దూసుకొచ్చింది. సెమీస్ పోరులో త‌బ‌డిన‌ కంగారూ పాకిస్థాన్‌ను ఒక్క వికెట్ తేడాతో ఓడించి ఊపిరి పీల్చుకుంది.


తుది జట్లు


ఆస్ట్రేలియా అండర్19: హ్యారీ డిక్సన్, సామ్ కాన్స్టాస్, హ్యూ వీబ్జెన్(కెప్టెన్), హర్జాస్ సింగ్, ర్యాన్ హిక్స్(వికెట్ కీపర్), ఆలివర్ పీక్, రాఫ్ మాక్‌మిల్లన్, చార్లీ ఆండర్సన్, టామ్ స్ట్రాకర్, మహ్లీ బార్డ్‌మన్, కల్లమ్ విడ్లర్


ఇండియా అండర్19: ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్(కెప్టెన్), ప్రియాంషు మోలియా, సచిన్ దాస్, ఆరవెల్లి అవనీష్(వికెట్ కీపర్), మురుగన్ అభిషేక్, రాజ్ లింబానీ, నమన్ తివారీ, సౌమీ పాండే