Former Indian cricketer Yuvraj Singhs house robbed: టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్ సింగ్(Yuvraj Singh) తల్లి షబ్నాన్ సింగ్ ఇంట్లో చోరీ జరిగింది. తన ఇంట్లో చోరీ జరిగిందని యువరాజ్‌ తల్లీ హర్యానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. హర్యానాలోని పంచకులలో ఉన్న షబ్నాన్ సింగ్ ఇంట్లో ఈ దొంగతనం జరిగింది. అయితే ఈ దొంగతనం జరిగి సుమారు ఆరు నెలలుకాగా తాజాగా కేసు నమోదు అయ్యింది. 75 వేల రూపాయల నగదు, నగలు చోరీకి గురైనట్లు.. పని మనిషే ఈ చోరికి పాల్పడిందని యువీ తల్లి షబ్నమ్‌ ఆరోపించింది. ఎండీసీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. షబ్నమ్ సింగ్ ఇంటిని శుభ్రం చేసేందుకు సాకేత్డీకి చెందిన లలితాదేవిని, వంట చేసేందుకు బీహార్‌కు చెందిన సలీందర్ దాస్‌ను నియమించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. గురుగ్రామ్‌లోని తన రెండో ఇంటికి వెళ్లి వచ్చేలోగా చోరీ జరిగిందని యువీ తల్లి పేర్కొన్నారు. అక్టోబర్ 5, 2023న, ఆమె తన MDC ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, కొన్ని ఆభరణాలు, దాదాపు రూ. 75 వేలు, మరికొన్ని వస్తువులు కనిపించలేదు. 


అరుదైన ఘనత
యువీ.. 2000 సంవత్సరంలో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. 2002 నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్‌లో యువరాజ్ తొలిసారిగా తెరపైకి వచ్చాడు. యువరాజ్ 63 బంతుల్లో 69 పరుగులు చేసి లార్డ్స్‌లో గంగూలీ చొక్కా విప్పి విజయనాదం చేసేలా చేశాడు. ఆ టోర్నీలో యువీ అద్భుత ప్రదర్శన చేశాడు. అప్పటికే తనకు క్యాన్సర్ సోకింది. అయినా కూడా ఆ టోర్నీలో యువరాజ్ సింగ్ 362 పరుగులు చేసి 15 వికెట్లు పడగొట్టాడు. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు గెలుచుకున్నాడు. 2000 లో జరిగిన అండర్- 19 ప్రపంచకప్ లోనూ యువరాజ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు అందుకున్నాడు. ఫీల్డింగ్ లో చిరుతలా కదులుతూ ది బెస్ట్ ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్నాడు. 2011 వన్డే ప్రపంచకప్ లో క్యాన్సర్ తో పోరాడుతూ కూడా యువీ ఆడిన ఇన్నింగ్స్ ఎవరూ మర్చిపోలేరు. 2007 టీ20 ప్రపంచకప్ లో ఇంగ్లండ్ పై యువరాజ్ సింగ్ కొట్టిన 6 బంతుల్లో 6 సిక్సులను క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది. ఆ మ్యాచులో ఇంగ్లిష్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో 6 బంతుల్లో 6 సిక్సులు బాదాడు. భారత అభిమానుల మదిలో ఆ షాట్లు ఎప్పటికీ నిలిచే ఉంటాయి.


దాదాపు 2 దశాబ్దాల పాటు భారత క్రికెట్ కు తన సేవలందించిన యువీ 2019లో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. మొత్తం 402 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన యువరాజ్‌ 11,778 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ 148 వికెట్లు పడగొట్టి మేటి ఆల్‌రౌండర్లలో ఒకడిగా నిలిచాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌లో విజేతగా నిలవడంలో ముఖ్య భూమిక పోషించాడు.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో రెండుసార్లు హ్యాట్రిక్స్ తీసిన బౌలర్ గా యువీ ఘనత సాధించాడు. 2009లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన యువరాజ్ సింగ్... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై తొలిసారి హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. మరలా ఆ ఏడాది ఐపీఎల్ లోనే డెక్కన్ ఛార్జర్స్ పై హ్యాట్రిక్ అందుకున్నాడు. 2016, 2019లలో ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లలో యువీ భాగమయ్యాడు.