Indias squad for T20I series against Australia announced: వరల్డ్ కప్ 2023 ఫైనల్ ముగిశాక టీమిండియా మరో సిరీస్ కు సన్నద్ధం అవుతోంది. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కు టీమిండియాను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సోమవారం రాత్రి ప్రకటించింది. ఆసీస్ తో జరగనున్న 5 టీ20ల సిరీస్ కు బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. నవంబర్ 23న విశాఖపట్నం వేదికగా ఆసీస్, భారత్ తొలి టీ20లో తలపడనున్నాయి. మొదటి 3 మ్యాచ్ లకు రుతురాజ్ వైస్ కెప్టెన్ కాగా, చివరి 2 టీ20లకు జట్టుతో కలవనున్న శ్రేయస్ అయ్యర్ ఆ మ్యాచ్ లకు సూర్య కుమార్ కు డిప్యూటీగా ఉంటాడని బీసీసీఐ తాజా ప్రకటనలో తెలిపింది.


IDFC ఫస్ట్ బ్యాంక్ 5-మ్యాచ్‌ల T20I సిరీస్ కోసం ఎంపిక కమిటీ జట్టును బీసీసీఐ ప్రకటించింది. జితేష్ శర్మ లాంటి హార్డ్ హిట్టర్ కు జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది. బౌలర్లు అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణలతో పాటు రవి బిష్ణోయ్ కి మేనేజ్ మెంట్ ఛాన్స్ ఇచ్చింది. వరల్డ్ కప్ ఆడిన సూర్యకుమార్, ఇషాన్ కిషన్ లు మాత్రమే ఈ టీ20 సిరీస్ కు ఎంపికయ్యారు. బ్యాటర్లుగా తిలక్ వర్మ, రుతురాజ్, జైస్వాల్, రింకూ సింగ్ లను తీసుకున్నారు. ఆల్ రౌండర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ లకు ఛాన్స్ ఇచ్చింది బీసీసీఐ.


భారత జట్టులో ఎవరంటే: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (WK), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్


ఆసీస్ తో టీ20 సిరీస్ షెడ్యూల్ ఇలా.. 
1. నవంబర్ 23 - 1వ T20, విశాఖపట్నం
2. నవంబర్ 26 - 2వ టీ20, తిరువనంతపురం
3. నవంబర్ 28 - 3వ T20, గువాహటి
4.  డిసెంబర్ 1  - 4వ టీ20, రాయ్ పూర్
5. డిసెంబర్ 3  - 5వ టీ20, బెంగళూరు


 


ఈ టీ 20 సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్టు 15 మంది సభ్యులతో జట్టును గత వారం ప్రకటించింది. కీప‌ర్ మాథ్యూ వేడ్‌కు కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. జ‌ట్టులో వార్నర్‌, స్టీవ్ స్మిత్‌, ట్రావిస్ హెడ్‌, మ్యాక్స్‌వెల్‌, స్టోయినిస్‌, జంపాలు ఉన్నారు. భారత జట్టులో వరల్డ్ కప్ ఆడిన వారిలో కొందరే ఈ సిరీస్ ఆడనుండగా.. ఆసిస్ జ‌ట్టులో చాలా వ‌ర‌కు వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆడుతున్న ఆటగాళ్లే ఉన్నారు. వ‌ర‌ల్డ్‌క‌ప్‌ కెప్టెన్ క‌మ్మిన్స్‌ తో పాటు మిచెల్ స్టార్క్‌, హేజ‌ల్‌వుడ్‌, కెమ‌రూన్ గ్రీన్‌, మిచెల్ మార్ష్ లకు విశ్రాంతి ఇచ్చింది ఆసీస్ మేనేజ్ మెంట్. ప్రపంచకప్‌ త‌ర్వాత వీరు భారత్ నుంచి స్వదేశం ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లారు.


టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు: మాథ్యూ వేడ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినీస్, జాష్ ఇంగ్లీస్, జాసన్ బెరన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లీస్, స్పెన్సర్ జాన్సన్, తన్వీర్ సంఘా, సీన్ అబాట్.