Markandey Katju Comments On Australia Win: అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా (Australia)తో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ (World Cup 2023 Final)లో టీమిండియా (Team India) ఓటమి పాలైంది. టోర్నమెంట్ ప్రారంభం నుంచి దూకుడుగా ఆడిన భారత్ ఫైనల్ పోరులో చేతులెత్తేసింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ విఫలమై ప్రపంచ కప్‌ (World Cup 2023)ను ఆస్ట్రేలియా చేతుల్లో పెట్టేసింది. భారత్ ఓటమిపై ఎవరికి వారు కొత్త కారణాలు, విశ్లేషణలు చేస్తున్నారు. సెంటిమెంట్లు కలిసి రాకపోవడం వల్లే భారత్ ఓడిందని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 


కొందరు మేధావులు మాత్రం భారత్ ఓటమికి ఇతర కారణాలు ఉన్నాయంటూ విచిత్రమైన వాదనలు చేస్తున్నారు. ఆయా ఇలాంటి వారి జాబితాలో తాజాగా సుప్రీంకోర్టు మాజీ జడ్జి మార్కండేయ కట్జూ (Markandey Katju) కూడా చేరిపోయారు. ఫైనల్ పోరులో భారత్ ఓడిపోవడానికి కారణం ఏంటో ఆయన ట్విటర్ వేదికగా చెప్పేశారు. ఆస్ట్రేలియా విజయానికి మహాభారత కాలం నాటి రోజులకు ఆయన ముడిపెట్టేశారు. ఆ కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.  


పాండవుల కాలంలో ఆస్ట్రేలియా మన భారతదేశానికి ఆయుధశాలగా ఉండేదని.. అందుకే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆ జట్టు భారత్‌పై విజయం సాధించిందని సోషల్ మీడియా ఎక్స్ (Twitter)లో జస్టిస్ కట్జూ పేర్కొన్నారు. ‘పాండవుల కాలంలో ఆస్ట్రేలియా ‘అస్త్రాల’ నిల్వ కేంద్రంగా ఉండేది. ఆ రోజుల్లో దానిని ‘అస్త్రాలయా’ అని పిలిచేవారు. వాళ్లు ప్రపంచకప్ గెలవడానికి ఇదే అసలు కారణం’ అని  కట్జూ పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కట్జూ వ్యాఖ్యలను కొందరు సరదాగా తీసుకుంటుండగా, మరికొందరు మాత్రం వాటికి కౌంటర్‌ వేస్తున్నారు.  






టీమిండియాకు ప్రధాని మద్దతు 
ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్‌కు అభిమానులు అండగా నిలుస్తున్నారు. గెలిచినా ఓడినా భారత్‌కు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెబుతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం భారత్ ఓటమిపై స్పందించారు. సోషల్ మీడియా ఎక్స్‌లో ఆయన భారత జట్టుకు మద్దతుగా ట్వీట్ చేశారు.  ‘యావత్ దేశం మీతోనే ఉంటుంది.. ఈరోజు, రేపు, ఎలప్పుడూ..’ అని ప్రధాని మోదీ అన్నారు.


ఆటలో గెలుపోటములు సహజం అని, ఓటమి పాలైనంత మాత్రాన నిరుత్సాహ పడిపోవాల్సిన అవసరం లేదని చెబుతూ ప్రధాని మోదీ స్పందించారు. ‘డియర్ టీమిండియా.. ప్రపంచ కప్ లో గొప్ప ప్రదర్శన కనబరిచారు. ఈ టోర్నీ మొత్తం మీ ప్రతిభ, సంకల్పం అద్భుతం, అమోఘం. మీరు గొప్ప స్ఫూర్తితో ఆడారు. దేశం గర్వించేలా చేశారు. ఈ దేశ ప్రజలు ఈరోజు, ఎల్లప్పుడూ మీతో పాటు ఉంటారు’ అంటూ ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.