ICC Team Of The Tournament Revealed: భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌(World Cup)  ముగిసింది. ఫైనల్‌లో ఓటమి భారత(Team India) ఆటగాళ్లతో పాటు కోట్లాది మంది అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది. ఈ ప్రపంచకప్‌లో అప్రతిహాత విజయాలతో దూసుకుపోయిన టీమిండియా... ఫైనల్లో తుదిమెట్టుపై బోల్తా పడింది. కోట్ల మంది భారత ఆభిమానుల హృదయాలు ముక్కలు చేస్తూ... కోటీ మంది ఆశలు గల్లంతు చేస్తూ ఆస్ట్రేలియా(Austrelia) ఆరోసారి ప్రపంచకప్‌ను ఒడిసిపట్టింది. ఆశలను.. ఆనందాలను.. అంచనాలను తలకిందులు చేస్తూ రోహిత్‌ సేనను ఫైనల్లో మట్టికరిపించి ఆరోసారి కంగారులు ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్నారు. ఈ ఓటమితో అభిమానుల గుండెలను రోహిత్‌ సేన కోత పెట్టింది. పుష్కర కాలం తర్వాత ఐసీసీ ట్రోఫీని ముద్దాడాలనే భారత జట్టు కల కలగానే మిగిలిపోయింది.


 నెలన్నరపాటు సాగిన టోర్నమెంట్‌ ముగియడంతో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ను ప్రకటించింది. ఇయాన్‌ బిషన్‌, కస్‌ నైడూ, షేన్‌ వాట్సన్‌, ఐసీసీ జనరల్‌ మేనేజర్‌ వసీం ఖాన్‌, అహ్మదాబాద్‌ జర్నలిస్టు సునీల్‌ వైద్య ఈ టీమ్‌ను సెలక్ట్‌ చేశారు. ఇందులో భారత, ఆసీస్‌ క్రికెటర్ల హవా కొనసాగింది. ఈ ప్రపంచ కప్‌లో అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించిన ఆటగాళ్లతో కూడిన జట్టును ఐసీసీ వెల్లడించింది. ఇందులో టీమిండియా ఆటగాళ్ల హవా స్పష్టంగా కనిపించింది. ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ది టోర్నమెంట్‌ జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ శర్మను ఐసీసీ ఎంపిక చేసింది. టీంలో మొత్తం 12 మంది ఆటగాళ్లకు స్థానం కల్పించగా అందులో ఆరుగురు ప్లేయర్లు ఉన్నారు. 

 

ఐసీసీ  టీమ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌

ఓపెనర్లు: రోహిత్ శర్మ(కెప్టెన్‌), క్వింటన్‌ డికాక్‌

రోహిత్ శర్మ (టీమిండియా): ఈ ప్రపంచకప్‌లో మొత్తం 11 మ్యాచుల్లో రోహిత్‌ శర్మ 597 పరుగులు చేశాడు. ఇందులో అఫ్ఘాన్‌పై ఒక శతకం కూడా ఉంది. 

క్వింటన్‌ డికాక్‌ (దక్షిణాఫ్రికా): ఈ ప్రపంచకప్‌లో నాలుగు శతకాలు చేశాడు. 10 మ్యాచుల్లో 594 పరుగులు సాధించాడు. వన్డే కెరీర్‌కు ఈ ప్రపంచకప్‌తో డికాక్‌ వీడ్కోలు పలికాడు.

 

వన్‌ డౌన్‌ బ్యాట్స్‌మన్‌

విరాట్ కోహ్లీ (భారత్): ఈ ప్రపంచకప్‌ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు. 11 మ్యాచుల్లో 765 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు.

 

మిడిల్‌ ఆర్డర్‌

 డారిల్ మిచెల్ (న్యూజిలాండ్): న్యూజిలాండ్‌ బ్యాటర్ డారిల్ మిచెల్ 10 మ్యాచుల్లో 552 పరుగులు సాధించాడు. రెండు సెంచరీలు చేశాడు. 

కేఎల్ రాహుల్ (భారత్): 11 మ్యాచుల్లో 452 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది. ఎన్నో క్లిష్ట మ్యాచుల్లో భారత్‌ భారీ స్కోరు సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు.

 

బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌

గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా): డబుల్ సెంచరీ చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ 9 మ్యాచుల్లో 400 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ ఆరు వికెట్లు పడగొట్టాడు. 

రవీంద్ర జడేజా (భారత్): స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఈ టోర్నీలో 20 వికెట్లు తీశాడు

 

సీమ్‌ బౌలర్లు

దిల్షాన్‌ మదుషంక (శ్రీలంక): ఈ ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించాడు.చ కేవలం 9 మ్యాచుల్లోనే 21 వికెట్లు పడగొట్టాడు. 

జస్‌ప్రీత్‌ బుమ్రా (భారత్): భారత స్టార్‌ పేసర్ బుమ్రా ఈ వరల్డ్ కప్‌లో 20 వికెట్లు పడగొట్టాడు. ఆరంభంలోనే వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెంచాడు. ఈ మెగా టోర్నీలో అత్యధిక డాట్‌ బాల్స్‌ వేసిన బౌలర్‌. 

మహమ్మద్ షమీ (భారత్): సంచలన బౌలింగ్‌తో ప్రత్యర్థులను కకావికలం చేశాడు. టాప్‌ వికెట్‌ టేకర్‌ కూడా షమీనే. కేవలం 7 మ్యాచుల్లోనే 24 వికెట్లు తీశాడు. 

స్పిన్నర్‌

ఆడమ్‌ జంపా (ఆస్ట్రేలియా): ఈ ఆసీస్‌ స్పిన్నర్‌ 11 మ్యాచుల్లో 23 వికెట్లు తీశాడు. మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌. 

 

ఎక్స్‌ ట్రా ప్లేయర్‌

గెరాల్డ్ కొయిట్జీ (దక్షిణాఫ్రికా): ఇతడిని ఐసీసీ 12వ ఆటగాడిగా ఎంపిక చేసుకుంది. దక్షిణాఫ్రికా పేసర్ కొయిట్జీ 8 మ్యాచుల్లో 20 వికెట్లు తీశాడు.