IND vs AUS Final 2023 : ప్రపంచ కప్‌ ప్రభంజనం ముగిసిపోయింది. చివరి వరకు పోరాడి వన్డే ప్రపంచ కప్‌ 2023 ఓడిపోయాం. ఇక అందరి దృష్టి 2027 ప్రపంచకప్‌పైనే. నాలుగేళ్ల తరువాత ఆ టోర్నీ సరికొత్త అనుభూతి పంచబోతోంది. దక్షిణాఫ్రికా (South Africa), జింబాబ్వే (zimbabwe)లు తొలిసారిగా నమీబియా (namibia)తో  కలిసి ఆతిథ్యమివ్వబోతున్న ఆ మెగా టోర్నీ ఎన్నో విశేషాలకు వేదిక కానుంది. ఈసారి  పోటీపడే జట్లు, ఫార్మాట్‌, నిబంధనలు.. ఇలా కొత్త మార్పులతో  అలరించనుంది. 2023 వరల్డ్ కప్ లో  మొత్తం  పది జట్లు 48 మ్యాచ్ లు ఆడి కప్పు కోసం పోటీపడ్డాయి.  కానీ 2027లో జట్ల సంఖ్య 14కు పెరుగుతుంది. దీంతో మ్యాచ్‌ల సంఖ్య కూడా  54కు చేరుతుంది.  


 అయితే  2003 మాదిరే 2027లో ఫార్మాట్‌ ఉండనుంది. ఈసారి 10 జట్లు రౌండ్‌ రాబిన్‌ లీగ్‌లో తలపడ్డాయి. దీంతో ఒక్కో జట్టు మిగతా తొమ్మిది జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడింది. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌ చేరాయి. కానీ వచ్చే ప్రపంచకప్‌ అలా కాదు మొత్తం 14 జట్లు 2 భాగాలుగా  ఏడేసి చొప్పున  విభజిస్తారు. ఒక్కో గ్రూప్‌లో ఒక్కో జట్టు మిగతా ఆరు జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. ఆ గ్రూప్‌ల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్‌ సిక్స్‌కు అర్హత సాధిస్తాయి.  అనంతరం తొలి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు సెమీస్‌ చేరతాయి. సెమీస్‌లో గెలిచిన రెండు జట్లు ఫైనల్లో తలపడతాయి. ఇప్పటికే ఆతిథ్య హోదాలో దక్షిణాఫ్రికా, జింబాబ్వే ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి.  వన్డే ర్యాంకింగ్స్‌లో తొలి 8 స్థానాల్లో నిలిచే జట్లు నేరుగా ఈ ప్రపంచకప్‌ ఆడతాయి. గ్లోబల్ క్వాలిఫయర్ టోర్నీల నుంచి మిగతా నాలుగు జట్లు వస్తాయి.  అయితే ఈ ప్రపంచ కప్ లో నమీబియా ఆడాలంటే మాత్రం అర్హత మ్యాచ్ ల ద్వారానే ఆడాల్సి ఉంటుంది. 


ఎంతగా మరచిపోదాం అనుకున్నా మనసుని ముక్కలు చేసిన క్షణాలు అవి.. ఆ క్షణం కోట్ల మంది హృదయాలు ముక్కలయ్యాయి. కోటీ మంది ఆశలు గల్లంతయ్యాయి. ఫైనల్‌ వరకు అప్రతిహాత విజయాలతో దూసుకొచ్చిన టీమిండియాకు ఫైనల్లో ఆస్ట్రేలియా దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. ఆశలను.. ఆనందాలను.. అంచనాలను తలకిందులు చేస్తూ రోహిత్‌ సేనను ఫైనల్లో మట్టికరిపించి ఆరోసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌లో టీమిండియాను తక్కువ పరుగులకే అవుట్‌ చేసిన ఆస్ట్రేలియా ఆ తర్వాత సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించి ఆరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది.  తొలుత బ్యాటింగ్‌లో టీమిండియాను తక్కువ పరుగులకే అవుట్‌ చేసిన ఆస్ట్రేలియా ఆ తర్వాత సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించి ఆరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. టీంఇండియా నిర్ణీత 50 ఓవర్ లలో 240 పరుగులు చేయగా ఆస్ట్రేలియా మరో 42 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.  


అలా అని భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో తుది మెట్టుపై టీమిండియాకు అపజయం ఎదురైనా ఎన్నో మధుర క్షణాలను  అందించింది. ఒక్క మ్యాచ్‌తో భారత్ విజయాలను తక్కువ చేసి చూడడం సరికాదు. ఈ ప్రపంచకప్‌లో అద్భుత ఇన్నింగ్స్‌లు... రికార్డులు.. కొత్త తారలు వెలుగులోకి వచ్చారు.