India vs Australia World Cup Final 2023: కోట్ల మంది భారత ఆభిమానుల హృదయాలు ముక్కలు చేస్తూ... కోటీ మంది ఆశలు గల్లంతు చేస్తూ ఆస్ట్రేలియా ఆరోసారి ప్రపంచకప్‌ను ఒడిసిపట్టింది. ఆశలను.. ఆనందాలను.. అంచనాలను తలకిందులు చేస్తూ రోహిత్‌ సేనను ఫైనల్లో మట్టికరిపించి ఆరోసారి కంగారులు ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్నారు. తొలుత బ్యాటింగ్‌లో టీమిండియాను తక్కువ పరుగులకే అవుట్‌ చేసిన ఆస్ట్రేలియా ఆ తర్వాత సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించి ఆరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది.


టీంఇండియా నిర్ణీత 50 ఓవర్ లలో 240 పరుగులు చేయగా ఆస్ట్రేలియా మరో 42 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ మిచెల్ మార్ష్ చేసిన పనిపై నెటిజన్లు మాజీలు, సహచర క్రికెటర్లు మండిపడుతున్నారు. ట్రోఫీ బ‌హూక‌ర‌ణ అనంత‌రం డ్రెస్సింగ్ రూమ్‌లో మార్ష్‌ సోఫాలో కూర్చొని ప్రపంచ క‌ప్ ట్రోఫీపై కాళ్లు పెట్టిన ఫొటో సామాజిక మాధ్యమాలను చుట్టేస్తోంది. ప్రతిష్ఠాత్మక ట్రోఫి పట్ల మిచెల్ మార్ష్ అవ‌మాన‌క‌రంగా ప్రవ‌ర్తించడంపై అభిమానులు భగ్గుమంటున్నారు. మార్ష్ ఇదేం పని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంత అహంకారం ఎందుకంటూ మరో నెటిజన్‌ ప్రశ్నించాడు. ద‌యచేసి మెగా ట్రోఫీకి కాసింత మ‌ర్యాద ఇవ్వండని మరో నెటిజన్‌ అభ్యర్థించాడు. ఆస్ట్రేలియ‌న్ల‌కు ఇది ఏమంత సిగ్గు చేటు కాదని మండిపడుతున్నారు. 


ప్రపంచకప్ 2023లో భారత్‌పై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలోని ఆటగాళ్లతో పాటు అభిమానులు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఈ ఓటమి మైదానంలో ఉన్న లక్ష మందికిపైగా అభిమానులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల హృదయాలను కలచివేసింది. టైటిల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 240 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 


టీమిండియా బౌలర్లు మ్యాచ్‌ను బలంగానే ప్రారంభించారు. ఆరంభంలోనే వార్నర్‌ వికెట్‌ తీసి షమీ శుభారంభం ఇచ్చాడు. ఆ తర్వాత మిచెల్‌ మార్ష్‌, స్టీవ్‌ స్మిత్‌ కూడా వెంటనే అవుటవ్వడంతో ఆసిస్‌ 47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు పట్టు బిగించేలానే కనపడ్డారు. కానీ ట్రానిస్‌ హెడ్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. 120 బంతుల్లో 137 పరుగులు చేసి కంగారులకు మరచిపోలేని విజయం అందించాడు. లబుషేన్‌.. ట్రానిస్‌ హెడ్‌కు మంచి సహకారం అందించాడు. లబుషేన్‌ 110 బంతుల్లో 58 పరుగులు చేశాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో ఆస్ట్రేలియా సునాయసంగా విజయం సాధించింది. ఫైనల్లో ఎలా ఆడాలో బాగా తెలిసిన ఆసిస్ బ్యాటర్లు నాలుగు వికెట్‌లు కోల్పోయి మరో 42 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.


మ్యాచ్ ముగిశాక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. రోహిత్ శర్మ పెవిలియన్‌కు తిరిగి వస్తుండగా అతని కళ్ల నుంచి నీళ్లు కనిపించాయి. అదే సమయంలో విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్ కూడా చాలా ఎమోషనల్‌ అయినట్టు కనిపించారు. ఈ ఓటమితో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలోని ఆటగాళ్లతో పాటు అభిమానులు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఈ ఓటమి మైదానంలో ఉన్న లక్ష మందికిపైగా అభిమానులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల హృదయాలను కలచివేసింది.