World Cup Final 2023: భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో తుది మెట్టుపై టీమిండియాకు అపజయం ఎదురైనా ఎన్నో మధుర క్షణాలను  అందించింది. ఒక్క మ్యాచ్‌తో భారత్ విజయాలను తక్కువ చేసి చూడడం సరికాదు. ఈ ప్రపంచకప్‌లో అద్భుత ఇన్నింగ్స్‌లు... రికార్డులు.. కొత్త తారలు వెలుగులోకి వచ్చారు. ఒకసారి వాటిని మననం చేసుకుంటే.

 

విరాట్‌... రన్‌మెషిన్‌

వన్డే ప్రపంచకప్‌ 2003లో క్రికెట్‌ గాడ్‌ 673 పరుగలు చేయగా... భారత్‌ వేదికగా 2023 ప్రపంచకప్‌లో కోహ్లీ ఆ రికార్డును బద్దలు కొట్టాడు. మొత్తం 11 ఇన్నింగ్స్‌ల్లోనే కోహ్లీ 765 పరుగులు చేసి కొత్త రికార్డు సృష్టించాడు. వన్డేల్లో 50వ సెంచరీతో మెరిసి తన ఆరాధ్య ఆటగాడు సచిన్‌ రికార్డును బద్దలుకొట్టాడు. న్యూజిలాండ్‌తో సెమీఫైనల్లో కోహ్లి 117 పరుగులు చేసే క్రమంలో సచిన్‌  అత్యధిక సెంచరీల రికార్డును దాటేశాడు. అంతేనా ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ అవార్డును కూడా తీసుకున్నాడు

 

మహ్మద్‌ షమీ

ఈ ప్రపంచకప్‌లో షమీ బౌలింగ్‌ నభూతో న భవిష్యతీ అన్నట్లు సాగింది. ప్రపంచ కప్‌ ఆరంభంలో నాలుగు మ్యాచ్‌లకు దూరమైన ఈ స్పీడ్‌ స్టార్‌.. తర్వాత విధ్వంసమే సృష్టించాడు. న్యూజిలాండ్‌తో సెమీఫైనల్‌ ఏడు వికెట్లతో జట్టును ఒంటిచేత్తో గెలిపించాడతను. దాదాపు 400 లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలో దిగిన న్యూజిలాండ్‌ కలవరపెట్టినా షమి ప్రత్యర్థి జట్టు వెన్ను విరిశాడు. ఏ భారత బౌలర్‌కూ సాధ్యం కాని రీతిలో ఏడు వికెట్లు తీసి జట్టును గెలిపించాడు. 

 

మ్యాక్స్‌వెల్‌ డబుల్‌ సెంచరీ

అఫ్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఆసీస్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ (201 నాటౌట్; 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్లు) డబుల్ సెంచరీ చేశాడు. ఓడిపోతుందనుకున్న ఆస్ట్రేలియాను మ్యాక్స్‌వెల్‌ గెలిపించడంతో పాటు ప్రపంచకప్ లో సెమీస్ చేర్చాడు. కండరాలు పట్టేసి కాలు ఇబ్బంది పెడుతున్న బాధను పంటి బిగువన భరిస్తూ ఒంటరి పోరాటం చేసి డబుల్ సెంచరీతో ఎన్నో రికార్డులు తిరగరాశాడు. అఫ్గానిస్థాన్ నిర్దేశించిన 292 పరుగుల లక్ష్యాన్ని మరో 19 బంతులు మిగిలుండగానే ఆసీస్ ఛేదించింది. కొన్ని కొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు మ్యాక్సీ. ఇదీ ఈ ప్రపంచకప్‌లోనే ది బెస్ట్‌ ఇన్నింగ్స్‌గా ఖ్యాతి గడించింది.

 

మాథ్యూస్‌ టైమ్డ్‌ అవుట్‌

ప్రపంచకప్‌లో పెను సంచలనం. తొలిసారిగా శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ ఏంజెలో మ్యాథ్యూస్‌ టైమ్డ్‌ అవుటయ్యాడు. ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్.. మాధ్యూస్‌ను టైమ్డ్‌ అవుట్‌ అంటూ అప్పీల్‌ చేశాడు. 42 బంతుల్లో 41 పరుగులు చేసిన సదీర సమరవిక్రమను షకీబ్ అవుట్ చేసిన తర్వాత మాథ్యూస్ బ్యాటింగ్‌కి వచ్చాడు. కానీ మాధ్యూస్‌ బ్యాటింగ్‌కు రావడానికి చాలా సమయం తీసుకున్నాడు. దీంతో అతడిని అంపైర్‌ టైమ్డ్‌ అవుట్‌గా ప్రకటించాడు. వికెట్ పడిన తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్‌ 2 నిమిషాల్లోపు తదుపరి బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. లేకపోతే అతను టైమ్డ్‌ అవుట్‌ అవుతాడు. ఏంజెలో మాథ్యూస్ బ్యాటింగ్ చేయడానికి ఆలస్యంగా వచ్చాడని షకీబ్ అప్పీల్ చేశాడు. దాంతో అంపైర్లు సమయం సరిచూసి అవుట్‌గా ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయిలో ఇలా అవుటైన తొలి బ్యాట్సమెన్‌ మాధ్యుసే.

 

రచిన్‌ రవీంద్ర... ది హీరో

న్యూజిలాండ్‌ ఫైనల్‌ చేరడంలో కీలక పాత్ర భారత సంతతి ఆటగాడు రచిన్‌ రవీంద్రదే. ఈ టోర్నీలో అతడు 3 శతకాలతో సహా 578 పరుగులు చేశాడు. అంతేనా కీలకమైన వికెట్లు తీసి కివీస్‌ సెమీఫైనల్‌ చేరడంలో కీలక పాత్ర పోషించాడు.

 

క్వింటన్‌ డికాక్‌

ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో క్వింటన్‌ డికాక్‌ ఒకడు. ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో నాలుగు సెంచ‌రీల‌తో రాణించాడు డికాక్‌. 10 మ్యాచుల్లో 594 ర‌న్స్ చేసి కోహ్లి త‌ర్వాత సెకండ్ హ‌య్యెస్ట్ స్కోర‌ర్‌. ప‌దేళ్ల వ‌న్డే కెరీర్‌లో 155 మ్యాచ్‌లు ఆడిన డికాక్ 6770 ర‌న్స్ చేశాడు. 21 సెంచ‌రీలు, 30 హాఫ్ సెంచ‌రీలు చేశాడు. 2013లో జ‌న‌వ‌రి 19న న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్ ద్వారా డికాక్ వ‌న్డే కెరీర్ ప్రారంభ‌మైంది. అయితే తన రిటైర్‌మెంట్ పై వరల్డ్ కప్ కు ముందే ప్రకటన చేశాడు డికాక్. ఈ ప్రపంచకప్‌తో ఓ దిగ్గజ ఆటగాడి కెరీర్‌ కూడా ముగిసింది.