టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాను దురదృష్టం వెక్కిరించింది. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే తొమ్మిది ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని ఏడు ఓవర్లలో 64 పరుగులకు కుదించారు. దక్షిణాఫ్రికా మూడు ఓవర్లలో 51 పరుగులు చేసిన దశలో తిరిగి వర్షం పడింది. ఒక్క మూడు నిమిషాలు వర్షం పడకుండా ఉంటే దక్షిణాఫ్రికా మరో ఓవర్‌లో ఈ లక్ష్యాన్ని ఛేదించి మ్యాచ్‌ను ముగించేది. కానీ అది సాధ్యం కాలేదు.
వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం అయిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. జింబాబ్వే టాప్-4 బ్యాటర్లు ఘోరంగా విఫలం అయ్యారు. చకాబ్వా (8: 8 బంతుల్లో, ఒక సిక్సర్), క్రెయిగ్ ఎర్విన్ (2: 6 బంతుల్లో), షాన్ విలియమ్స్ (1: 1 బంతి), సికిందర్ రాజాలు (0: 2 బంతుల్లో) త్వరగా అవుట్ కావడంతో జింబాబ్వే 19 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.
అయితే మదెవెరె (35 నాటౌట్: 18 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) వేగంగా ఆడాడు. నిదానంగా అయినా మిల్టన్ షుంబా (18: 20 బంతుల్లో, రెండు ఫోర్లు) కొన్ని పరుగులు జోడించాడు. దక్షిణాఫ్రికా కూడా బౌలింగ్‌లో 15 ఎక్స్‌ట్రాలు వేసింది. దీంతో జింబాబ్వే తొమ్మిది ఓవర్లలో ఐదు వికెట్లకు 79 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి రెండు వికెట్లు, వేన్ పార్నెల్, ఆన్రిచ్ నోర్కియా తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని ఏడు ఓవర్లలో 64 పరుగులకు కుదించారు. కానీ వర్షం సూచనలు ఉండటంతో దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ (47 నాటౌట్: 18 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్) జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరో ఓపెనర్ టెంపా బవుమాను (2 నాటౌట్: 2 బంతుల్లో) రెండో ఎండ్‌కు పరిమితం చేసి వార్ వన్‌సైడ్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ మరో ఓవర్‌లో మ్యాచ్ ముగిస్తారనగా వర్షం మళ్లీ పడింది. దీంతో మ్యాచ్‌ను రద్దు చేశారు.