India vs Pakistan: టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో భారత జట్టు తన ప్రయాణాన్ని విజయంతో ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌ను ఓడించింది. మెల్బోర్న్‌లో భారత్, పాకిస్థాన్‌ మధ్య చాలా ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఆఖరి బంతి వరకు నరాలు తెగే టెన్షన్‌తో మ్యాచ్‌ సాగింది. 


ఈ విజయం తర్వాత భారత జట్టు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఓటమి తర్వాత పాకిస్థాన్ అభిమానులతోపాటు పలువురు మాజీ క్రికెటర్లు నిరాశకు గురయ్యారు. అయితే టీ20 వరల్డ్‌కప్‌ 2022లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మరో మ్యాచ్ ఉంటుందని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డారు. 


పాకిస్థాన్ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ భారత్ ఒక మ్యాచ్ గెలిచిందని, పాకిస్తాన్ ఒక మ్యాచ్ ఓడిపోయిందని విశ్లేషించారు. ఈ టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్ మరోసారి తలపడనున్నాయన్నారు. భారత్, పాకిస్థాన్ జట్లు ఆడితేనే ప్రపంచ కప్‌నకు చాలా ప్రత్యేకత వస్తోందని తెలిపారు షోయబ్. ఇది చరిత్రలో అత్యంత ప్రత్యేకమైన మ్యాచ్‌లలో ఒకటని వివరించారు. మెల్‌బోర్న్‌ వికెట్ చాలా ఘోరంగా ఉందని విశ్లేషించారు.


పిచ్‌ ఎంత ఘోరంగా ఉన్నప్పటికీ పాకిస్తాన్ 160 పరుగులు చేసిందన్నారు షోయబ్‌. పాకిస్థాన్ లోయర్, మిడిల్ ఆర్డర్ చాలా పేలవంగా ఆడిందని విమర్శించారు. ఇంకా భారీ స్కోరు చేయాల్సిన టైంలో ఇలా చేయడం జట్టుకు ఓటమికి కారణమైందని  తెలిపారు. పాకిస్తాన్ ఈ మ్యాచ్ ఓటమిని అంగీకరించి తదుపరి మ్యాచ్ కు ప్రణాళిక వేయాలని సూచించారు.


వసీం అక్రమ్ ప్రకారం...
నో-బాల్ ఇచ్చే ముందు థర్డ్ అంపైర్ సహాయం తీసుకోవాలి. 'బంతి కిందకు వస్తున్నట్లు అనిపించింది. బ్యాటర్‌ నో బాల్ ను డిమాండ్ చేస్తాడు, కానీ మీ వద్ద టెక్నాలజీ ఉంటే, మీరు దానిని ఉపయోగించి ఉండాలి. అని అభిప్రాయపడ్డారు


వకార్ యూనిస్ మాట్లాడుతూ..."స్క్వేర్ లెగ్ అంపైర్ మొదట మెయిన్‌ అంపైర్‌తో మాట్లాడి ఉండాల్సింది. దీని తరువాత, అతను మూడో అంపైర్ వద్దకు వెళ్ళవచ్చు. అందుకే థర్డ్ అంపైర్ కూర్చున్నారు. ఆ నిర్ణయాన్ని వారికే వదిలేసి ఉండాల్సింది' అని అన్నారు.


షోయబ్ అక్తర్ ఈ బంతిపై ట్వీట్ చేసి అంపైర్ ఆలోచించాలని సూచించారు. "అంపైర్ బ్రదర్స్, ఈ రాత్రికి ఇది ఆలోచించాల్సిన విషయం" అని ఆయన తన ట్విట్టర్‌లో రాశారు. 


మరోవైపు ఈ మ్యాచ్ లో భారత్ విజయానికి చివరి ఓవర్ లో 16 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ వేయడానికి వచ్చిన స్పిన్ బౌలర్ మహ్మద్ నవాజ్... పరుగులు సమర్పించుకున్నాడు. దీనిపై భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు.


తొలి బంతికే హార్దిక్ పాండ్యాను నవాజ్ పెవిలియన్ చేర్చాడు. రెండో బంతికి సింగిల్ వచ్చింది. విరాట్ కోహ్లీ మూడో బంతికి రెండు పరుగులు తీశాడు. విరాట్ కోహ్లీ నాలుగో బంతికి సిక్స్ కొట్టాడు, ఇది నో బాల్‌గా అంపైర్లు ప్రకటించారు. దీని తరువాత నవాజ్ ఒక వైడ్ బంతిని విసిరాడు. తర్వాతి ఫ్రీ హిట్ బంతికి బై రూపంలో మూడు పరుగులు వచ్చాయి. ఓవర్ ఐదో బంతికి దినేశ్ కార్తీక్ స్టంపింగ్ ద్వారా వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత నవాజ్ మరో వైడ్ వేశాడు. చివరి బంతికి అశ్విన్ ఫోర్ కొట్టి మ్యాచ్‌ను టీమ్ ఇండియా ఖాతాలో వేశాడు.


నవాజ్ ఓవర్ పై సెహ్వాగ్ రియాక్షన్


మ్యాచ్ అనంతరం భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ...'నేను ఆ స్థానంలో ఉంటే, సాధారణ ఎడమ చేతి స్పిన్ బౌలింగ్ చేయమని చెప్పేవాడిని. అక్కడ పరుగులు చాలా ఉన్నాయి. అది ఫరవాలేదు. 16 పరుగులు తక్కువేం కాదు, కానీ బంతి వేయడానికి భయపడవద్దు అని మాత్రం చెప్పేవాడిని. నా జీవితంలో ఎన్నడూ చేయనిది... అంటే వసీం అక్రమ్ బంతిని పట్టుకున్నప్పటికీ కొంచెం కూడా భయపడలేదు."


ఈ మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ నవాజ్ ను ప్రోత్సహించి... "నవాజ్ బౌలింగ్‌ సమస్య కాదు, నువ్వు మ్యాచ్ విన్నర్‌వి, నేను ఎల్లప్పుడూ నిన్ను నమ్ముతాను. చివరి ఓవర్ వేసేటప్పుడు ఎంత ఒత్తిడి ఉంటుందో తెలుసు. మ్యాచ్ చాలా క్లోజ్‌లో ఓడిపోయాం కాబట్టి ఇది పెద్ద విషయంగా అనిపించవచ్చు. ఈ విషయాలన్నీ ఇక్కడే వదిలేయండి. మనం ముందుకు సాగాలి. ప్రతి మ్యాచ్‌ తాజాగా ప్రారంభించాలి. అంతా ఒక జట్టుగా చాలా బాగా ఆడాము. దీన్ని ఇకపై కూడా కొనసాగించాలి అని అన్నాడు.