India Vs Pakistan: భారత్- పాక్ మ్యాచ్ చూస్తూ గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి!

ABP Desam Updated at: 24 Oct 2022 05:35 PM (IST)
Edited By: Murali Krishna

India Vs Pakistan: భారత్- పాకిస్థాన్ మధ్య జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌ చూసి అసోంలో ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించాడు.

(Image Source: Getty)

NEXT PREV

India Vs Pakistan: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జరిగిన భారత్- పాకిస్థాన్ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠకు గురి చేసింది. చివరి బంతి వరకు టెన్షన్ టెన్షన్‌గా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌ చూస్తూ అసోంలో ఓ వ్యక్తి హార్ట్‌ ఎటాక్‌తో మృతి చెందాడు.


ఇదీ జరిగింది


అసోం శివసాగర్ జిల్లాలో బితు గొగోయి (34).. ఆదివారం భారత్, పాక్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు గుండెపోటుతో మరణించాడు. ఆదివారం సాయంత్రం గొగోయి, అతని స్నేహితులు ఇండియా Vs పాకిస్థాన్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్న స్థానిక సినిమా హాల్‌కు వెళ్లారు. 


అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో గొగోయి ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కుప్పకూలిపోయాడు. వెంటనే అతడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.



క్రికెట్ మ్యాచ్ సందర్భంగా సినిమా హాల్‌లో విపరీతమైన శబ్దం రావడంతో గొగోయికి గుండెపోటు వచ్చిందని వైద్యులు తెలిపారు. అతని మృతదేహాన్ని శవపరీక్షకు పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. 34 ఏళ్ల గొగొయి ఆరోగ్యంగా ఉండేవాడని, అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని అతని కుటుంబం తెలిపింది.                                             -         పోలీసులు


మరపురాని గెలుపు


నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిని ఈ పోరులో పాకిస్థాన్‌పై భారత్‌ థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించింది. దాయాది జట్టుపై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 160 పరుగుల ఛేదనలో 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచిన జట్టును విరాట్‌ కోహ్లీ (82*) అద్భుత ఇన్నింగ్స్‌తో ఒంటిచేత్తో విజయ తీరాలకు చేర్చాడు.  


చివరి బంతి వరకు విజయం దోబూచులాడిన ఈ మ్యాచ్‌లో.. కోహ్లీ తుది వరకు క్రీజులో నిలిచి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. విరాట్‌కు హార్దిక్‌ పాండ్య (40) అండగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌ తన కెరీర్‌లోనే బెస్ట్ అని విరాట్ కోహ్లీ మ్యాచ్ అనంతరం తెలిపాడు.



ఇది ఒక నమ్మశక్యం కాని మూమెంట్. నిజం చెప్పాలంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు. నిన్ను నువ్వు నమ్ము, చివరి వరకు ఉండమని హార్దిక్ నాకు చెప్తూనే ఉన్నాడు. నవాజ్ ఒక ఓవర్ వేయక తప్పదని మాకు తెలుసు. హరీస్ రౌఫ్‌ను బాగా ఆడితే, అప్పుడు వారు భయాందోళనలకు గురవుతారు. ఎందుకంటే అతను వారి ప్రధాన బౌలర్. 19వ ఓవర్లో ఆ రెండు సిక్సర్లు కొట్టడానికి నన్ను నేను ఎంతో మోటివేట్ చేసుకున్నాను. దీంతో సమీకరణం 8 బంతుల్లో 28 పరుగుల నుంచి 6 బంతుల్లో 16 పరుగులకు వచ్చేసింది. ఈరోజు వరకు నేను ఆస్ట్రేలియాపై మొహాలీ (2016 T20 ప్రపంచ కప్) ఇన్నింగ్స్ నా అత్యుత్తమమని చెప్పాను. నేను అక్కడ 52 బంతుల్లో 82 పరుగులు సాధించాను. ఈరోజు నేను 53 బంతుల్లో 82 పరుగులు చేశాను. కానీ నాకు ఈ ఇన్నింగ్సే గొప్పది. ఒకానొక పరిస్థితిలో విజయం అసాధ్యం అనిపించింది. కానీ హార్దిక్ నన్ను పుష్ చేస్తూనే ఉన్నాడు..                                         -        విరాట్ కోహ్లీ


Also Read: PM Modi in Kargil: దీపావళి వేళ మోదీకి సర్‌ప్రైజ్- 21 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా!

Published at: 24 Oct 2022 05:31 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.