Venkata Sanjana Kidnap Case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బద్వేల్ విద్యార్థిని అపహరణ కేసును పోలీసులు ఛేదించారు. ఈనెల 14వ తేదీన అపహరణకు గురైన విద్యార్థిని కిడ్నాప్ చేసిన మహిళను పట్టుకున్నారు. బాలికను తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. ఆ కిడ్నాప్ కేసు వివరాలిలా ఉన్నాయి. 


వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని గోపిరెడ్డి స్కూల్ లో ఏడో తరగతి చదువుతున్న వెంకట సంజన.. రోజూలాగే ఈ నెల 14వ తేదీన ఉదయం బడికి వెళ్లింది. స్కూలు అయిపోయాక బడి నుంచి బయటకు వచ్చిన సంజన.. ఇంటికి కూడా వెళ్లలేదు. అయితే సాయంత్రం గడుస్తున్నా కూతురు ఇంటికి రాకపోవడంతో ఆందోళన పడ్డ తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులకు ఫోన్ చేశారు. అయితే సంజన బడి అయిపోగానే బయటకు వెళ్లిందని చెప్పడంతో తల్లిదండ్రుల్లో మరింత టెన్షన్ మొదలైంది. ఆమె స్నేహితులు, బంధువులు, తెలిసన వాళ్లందరికీ ఫోన్ లు చేశారు. పట్టణంలోని పలు ప్రాంతాలన్నీ గాలించారు. అయినప్పటికీ ఆమె ఆచూకీ లభించకపోవడంతో.. ఇక లాభం లేదనుకొని పోలీసులను ఆశ్రయించారు. 


కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వెంకట సంజన అపహరణకు గురైనట్లు గుర్తించారు. బద్వేలు నుంచి నెల్లూరు ఆ తర్వాత విజయవాడకు ఓ మహిళ కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీల ద్వారా గుర్తించారు. వెంటనే విజయవాడకు వెళ్లి మహిళ దగ్గర నుంచి బాలికను సురక్షితంగా కాపాడారు. నిందితురాలితో పాటు విద్యార్థినిని కూడా ప్రత్యేక వాహనంలో బద్వేలుకు సురక్షితంగా తీసుకొచ్చారు. ఈ కేసులో మరికొందరు మహిళల ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 


ఇదే జిల్లాలో కళాశాల విద్యార్థి అదృశ్యం.. చివరకు శవంగా!


వైఎస్సార్ జిల్లా బి.కోడూరు మండలం మారాటిపల్లి గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని అనూష బద్వేల్ లోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతోంది. ఈనెల 20వ తేదీన రోజూలాగే కళాశాలకు వెళ్లింది. కానీ సాయంత్రం గడుస్తున్నా అమ్మాయి ఇంటికి రాలేదు. ఆమె స్నేహితులకు, కళాశాల యాజమాన్యానికి, బంధువలకు ఫోన్ చేశారు. అయినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అసలే రోజులు బాగోలేవని.. పోలీసులకు ఫిర్యాదు చేయడం మంచిదని భావించిన తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే మూడు రోజుల తరువాత సిద్ధవటం మండలం జంగాలపల్లి వద్ద పెన్నా నదిలో అనూష శవమై కనిపించింది. మృతదేహం తమ కుమార్తెదేనని అనూష తల్లిదండ్రులు గుర్తించారు. మృతదేహంపై తలపైన వెంట్రుకలు ఈడిపోయి ఉండడం, మొహానికి ఓవైపు కాలినట్లు ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 


దీనంతటికి బద్వేల్ మండలం పాపిరెడ్డి పల్లెకు చెందిన గురు మహేశ్వర్ రెడ్డియే కారణం అని అనూష తల్లిదండ్రులు సిద్ధవటం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురుమహేశ్వర్ రెడ్డి, అనూష ఇద్దరూ ఓకే కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు. అయితే ఈనెల 20వ తేదీన గురు మహే్ృశ్వర్ రెడ్డి, అనూష, మరో నలుగురు యువకులు కలిసి సిద్ధవటం కోటకు వెళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు. సిద్ధవటం కోటకు వెళ్లిన తర్వాత అక్కడ ఏం జరిగిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సంఘటనా స్ఖలంలోనే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనూష తల్లిదండ్రుల ఫిర్యాదుతో గురు మహేశ్వర్ రెడ్డితో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసులు తీరుపై అనూష కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసుపై దర్యాప్తు జరుగుతోందన్న డీఎస్పీ వంశీధర్ గౌడ్.. గురు మహేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.