Hyderabad Road Accident: హైదరాబాద్ లోని వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని పనామా కూడలి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పనామా కూడలి వద్ద జాతీయ రహదారిపై వేగంగా దూసుకు వచ్చిన ఓ స్పోర్ట్స్ బైక్ అదుపు తప్పి ఆల్టో కారును ఢీకొట్టింది. బైక్ వేగంగా ఉండటంతో బైక్ పై ఉన్న వ్యక్తి దానిని ఏమాత్రం కంట్రోల్ చేయలేకపోయాడు.ఆ వేగానికి కారును ఢీకొట్టిన తర్వాత గాలిలోకి  అంతెత్తున ఎగిరి కింద పడ్డాడు. తలకు, శరీరానికి తీవ్ర గాయాలు కావడంతో సంఘనట స్థలంలోనే సందీప్ ప్రాణాలు కోల్పోయాడు. బైక్ అతి వేగంగా వచ్చిన కారును ఢీకొట్టగా.. కారు కూడా ధ్వంసం అయింది. కారులో ఉన్న ఓ మహిళ కూడా తీవ్రంగా గాయపడింది. 


150 కిలోమీటర్ల వేగంతో వచ్చి..


స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన మహిళను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వ్యక్తి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేసి అతివేగమే ప్రమాదానికి కారణంగా నిర్ధారించారు. బైక్ నడుపుతున్న యాసిన్ అనే వ్యక్తి తలకు తీవ్ర గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో స్పోర్ట్స్ బైక్ వేగం గంటకు 150 కిలో మీటర్లుగా ఉందని పోలీసులు తెలిపారు. 


అతివేగం, నిర్లక్ష్యం పనికిరాదు


రోడ్డు ప్రమాదాలు చాలా వరకు అతి వేగం, నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనల వల్లే జరుగుతున్నాయని పోలీసు అధికారులు, ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. అనువుకానీ రోడ్డుపై కూడా అతి వేగంగా వాహనాలను నడపడం వల్ల, వాటిని నియంత్రించలేక ప్రమాదాలు సంభవిస్తున్నట్లు వెల్లడించారు. రోడ్డుపై వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు చెబుతున్నారు. మద్యం తాగి ఎట్టిపరిస్థితుల్లోనూ వాహనాలు నడపవద్దని, క్యాబ్ లు, ఆటోలు, పబ్లిక్ ట్రాన్స్ పోర్టు ఉపయోగించి వెళ్లాలని సూచిస్తున్నారు. అలాగే కారులో వెళ్తున్నప్పుడు సీట్ బెల్ట్, బైక్ పై వెళ్తున్నప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని చెబుతున్నారు. బైక్ పై వెనక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించడం వల్ల తీవ్ర గాయాలను అరికట్టవచ్చని సూచిస్తున్నారు. నిర్లక్ష్యం, అతి వేగం, నిబంధనల ఉల్లంఘనల వల్ల ప్రాణాలు కోల్పోతారని హెచ్చరిస్తున్నారు. 


రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఇతరుల నిర్లక్ష్యం కూడా మన ప్రాణాల మీదకు తీసుకువస్తుందని, అందుకే రోడ్డుపై వెళ్తున్న అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని ట్రాఫిక్ ఉన్నత అధికారులు వెల్లడిస్తున్నారు. రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఒక్కరూ చేసే నిర్లక్ష్యం ఎంతో మందికి తమ జీవితాలను దూరం చేస్తుందని, వారి కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వాహనంపై వెళ్తున్నప్పుడు, మన కోసం ఇంటి వద్ద ఎదురు చూసే వారు ఉన్నారన్న విషయం ఎప్పుడూ మదిలో మెదులుతూ ఉండాలని చెబుతున్నారు. కార్యాలయాలకు, దుకాణాలకు వెళ్లే సమయంలో అతివేగం పనికి రాదని, కొంత ముందుగా వెళ్లి సురక్షితంగా గమ్యస్థానం చేరుకోవాలని చెబుతున్నారు.