హైదరాబాద్‌లో ఆదివారం (అక్టోబరు 23) గౌడ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పైన కేటీఆర్ సరదా వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడిన దానికి బదులుగా కేటీఆర్ ఈ కామెంట్లు చేశారు. గౌడ సమ్మేళనం కార్యక్రమంలో తొలుత శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. రామన్న (కేటీఆర్) వెంట తాను లక్ష్మణుడిలా ఉంటానని అన్నారు. గౌడలకు ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలు ప్రకటించాలని కోరారు. ఆ తర్వాత మాట్లాడిన కేటీఆర్.. శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ‘ఈ మధ్యనే సీనన్న (మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌) తాత అయిండు.. ఇంకా నన్ను రామన్నా.. రామన్నా.. అని పిలుస్తున్నడు’ అని సరదాగా అన్నారు. దీంతో వేదికపై ఉన్న వారే కాకుండా, ఎదురుగా ఉన్నవారు కూడా ఫక్కున నవ్వారు.


హైదరాబాద్ శివారులోని మన్నెగూడలో గౌడ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి పేదవాడికి తమ ప్రభుత్వం న్యాయం చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో కరెంటు సమస్య తీరిపోయిందని తెలిపారు. ఒకప్పుడు నల్గొండ జిల్లాలో తాగు నీటి సమస్య తీవ్రంగా ఉండేదని కేటీఆర్ గుర్తు చేశారు. నల్గొండ జిల్లాలో అమ్మాయిని ఇవ్వాలంటే తల్లిదండ్రులు ఆలోచించేవారని వివరించారు. ఇప్పుడు ఇంటి ముందే నల్లా ఏర్పాటు చేసి నీరు అందిస్తున్నామని అన్నారు.


ప్రతి నెలా వారికి పెన్షన్లు ఇస్తున్నామని, చెట్ల పన్ను రద్దు చేశామని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో గల ప్రతి సామాజిక వర్గానికి అండగా ఉంటున్నామని తెలిపారు. కులాలకు సంక్షేమ భవనాలు కూడా నిర్మిస్తున్నామని వివరించారు. ఎక్కడ ఎవరికీ ఏ ఆపద వచ్చినా తాము ఉన్నామని భరోసా కల్పించారు.


26న గొల్ల, కురుమల ఆత్మీయ సమ్మేళనం


యాదవులు, కురుమలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. శనివారం (అక్టోబరు 22) వెస్ట్‌ మారేడ్‌పల్లిలోని తన ఇంటి వద్ద ఈ నెల 26న మన్నెగూడలోని బీఎంఆర్‌ సార్థ కన్వెన్షన్‌లో జరిగే యాదవ, కుర్మల ఆత్మీయ సమ్మేళనం బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం యాదవ సంఘం ముఖ్య నాయకుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. జనాభా పరంగా యాదవులు, కుర్మలు పెద్ద సంఖ్యలో ఉన్నారని, ఉమ్మడి లనలో యాదవ, కురుమలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని అన్నారు.


యాదవులు, కుర్మలు ఐక్యతను చాటి చెప్పేందుకు నిర్వహించే ఆత్మీయ సమ్మేళనంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి తలసాని పిలుపు ఇచ్చారు. గొల్ల, కురుమలకు రూ.11 వేల కోట్లతో సబ్సిడీపై గొర్రెల యూనిట్లను పంపిణీ చేసిన విషయాన్ని మంత్రి తలసాని గుర్తు చేశారు. గొర్రెల యూనిట్‌ లబ్ధిదారులకు పైలెట్‌ ప్రాజెక్ట్‌గా నగదు బదిలీని చేపడితే బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి నిలిపివేయించారని గుర్తు చేశారు. వచ్చే మునుగోడు ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.