PM Modi in Kargil: ప్రధాని నరేంద్ర మోదీ.. సరిహద్దులో కార్గిల్ సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్నారు. ఈ సందర్భంగా మోదీకి ఓ వ్యక్తి సర్‌ప్రైజ్ ఇచ్చారు. భారత సైన్యంలోని మేజర్ అమిత్ దీపావళి సంబరాల్లో ఉన్న మోదీని సోమవారం కలిశారు. 21 ఏళ్ళ క్రితం మోదీతో కలిసి తాను తీయించుకున్న ఫొటోను మేజర్ అమిత్ చూపించారు. ఇది చూసిన మోదీ ఆయనను ఆత్మీయంగా పలకరించారు.
అప్పట్లో
2001లో అమిత్ గుజరాత్‌లోని బాలాచాడి సైనిక్ స్కూల్‌లో చదివారు. ఆ సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ నుంచి అమిత్ ఓ పురస్కారాన్ని స్వీకరించారు. ఆ మధుర క్షణాలకు సంబంధించిన ఫొటోను చాలా జాగ్రత్తగా తన వద్ద ఉంచుకున్నారు.
ప్రస్తుతం అమిత్.. భారత సైన్యంలో మేజర్‌గా పని చేస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా మోదీ సోమవారం కార్గిల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మేజర్ అమిత్ మోదీని కలిశారు. 21 ఏళ్ల క్రితం మోదీతో తీయించుకున్న ఫొటోను పట్టుకుని మళ్ళీ ఇద్దరూ ఫొటో తీయించుకున్నారు.
మీరే నా ఫ్యామిలీ
జవాన్లతో కలిసి దీపావళిని జరుపుకోవడం తనకు మరింత ప్రత్యేకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో జవాన్లతో కలిసి దీపావళిని జరుపుకునే సంప్రదాయాన్ని ప్రధాని మోదీ ఈ ఏడాది కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా కార్గిల్‌లో సైనికులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.
యుద్ధాన్ని కోరుకోం
" మేము యుద్ధాన్ని మొదటి ఎంపికగా ఎప్పుడూ చూడలేదు. అది లంకా యుద్ధం కావచ్చు లేదా కురుక్షేత్ర యుద్ధం కావచ్చు.. మేము దానిని వాయిదా వేయడానికి చివరి వరకు ప్రయత్నించాం. మేము యుద్ధానికి వ్యతిరేకం కానీ బలం లేకుండా శాంతి ఉండదు. ఎవరైనా మనల్ని చెడు దృష్టితో చూసే ధైర్యం చేస్తే, మన సాయుధ దళాలు తగిన సమాధానం ఇస్తాయి. "