West Indies defeat Papua New Guinea: టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup)లో ఆతిథ్య వెస్టిండీస్‌(WI) శుభారంభం చేసింది. పసికూన పపువా న్యూ గినియా (PNG)తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో కరేబియన్లు చెమచోడ్చి గెలిచారు. ఈ లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో అద్భుత పోరాటంతో పపువా న్యూ గినియా ఆకట్టుకుంది. ఓ దశలో వెస్టిండీస్‌కు పపువా న్యూగినియా  షాక్‌ ఇచ్చేలా కనిపించింగి. కానీ టీ 20ల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న విండీస్‌ ఆటగాళ్లు మరో ఆరు బంతులు మిగిలి ఉండగా విజయం సాధించారు. ఈ మ్యాచ్‌లో శుభారంభంతో టీ 20 ప్రపంచకప్‌ వేటను కరేబియన్‌ జట్టు ఘనంగా ఆరంభించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన  పపువా న్యూగినియా  నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 136 పరుగులకే పరిమితమైంది. అనంతరం 19 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి విండీస్‌ లక్ష్యాన్ని ఛేదించింది. 
 

రాణించిన విండీస్‌ బౌలర్లు 

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌... పపువా న్యూగినిని బ్యాటింగ్‌కు అహ్వానించింది. పసికూనపై విండీస్‌ బౌలర్లు విరుచుకుపడ్డారు. పరుగులు రావడమే గగనమైపోయింది. అయిదు పరుగుల వద్దే పపువా న్యూగిని తొలి వికెట్‌ను కోల్పోయింది. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే రొమారియో షెపర్డ్‌ బౌలింగ్‌లో టోరి ఊరా అవుటయ్యాడు. అయిదు బంతుల్లో కేవలం రెండే పరుగులు చేసి ఊరా అవుటయ్యాడు. ఆ తర్వాత మరో రెండు పరుగులకే పపువా మరో వికెట్‌ కోల్పోయింది. లెగా సియాకా కేవలం రెండే బంతులు ఎదుర్కొని ఒక పరుగు చేసి హోసైన్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. కానీ సెసె బవూ పపువా న్యూగినియా  జట్టును ఆదుకున్నాడు. 43 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్స్‌తో 50 పరుగులు చేసి పపువా స్కోరును వంద పరుగులు దాటించాడు. మిగిలిన బ్యాటర్లలో కిప్లిన్‌ డోరిగా 27, కెప్టెన్‌ అసద్‌ వాలా 21 పరుగులతో పర్వాలేదనిపించారు. పపువా జట్టులో అయిదుగురు బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో పపువా న్యూగినియా  నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 136 పరుగులకే పరిమితమైంది.

 

విండీస్‌ కష్టంగానే

137 పరుగుల లక్ష్యాన్ని విధ్వంసకర బ్యాటర్లు ఉన్న విండీస్‌ అలవోకగా ఛేదిస్తుందని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. విండీస్‌ను పపువా బౌలర్లు కట్టడి చేశారు. పరుగులు చేసేందుకు శ్రమించేలా చేశారు. రెండో ఓవర్‌లోనే ఎదుర్కొన్న తొలి బంతికే జాన్సన్‌ చార్లెస్‌ పెవిలియన్‌కు చేరాడు. దీంతో విండీస్‌ ఎనిమిది పరుగల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆతర్వాత బ్రండన్‌ కింగ్‌, నికోలస్‌ పూరన్‌ సమయోచితంగా ఆడడంతో విండీస్‌ విజయం దిశగా పయనించింది. ఓ దశలో ఎనిమిది ఓవర్లలో 61 పరుగులు చేసి ఒకే వికెట్‌ కోల్పోయిన విండీస్‌ సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. కానీ పపువా బౌలర్లు తలొంచలేదు. వెంటవెంటనే నాలుగు వికెట్లు కోల్పోయి విండీస్‌ కష్టాల్లో పడింది. పూరన్‌ 27, బ్రండన్‌ కింగ్‌ 34, పావెల్‌ 15, రూధర్‌ ఫర్డ్‌ 2 పరుగులు చేసి అవుటయ్యారు. దీంతో చివరి నాలుగు ఓవర్లలో విండీస్‌ 40 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆ దశలో విండీస్‌కు పపువా న్యూగిని షాక్‌ ఇస్తుందా అనిపించింది. కానీ చేజ్‌... అండ్రూ రసెల్‌(andre russell) మూడు ఓవర్లలోనే 40 పరుగులు చేసి విండీస్‌ను గెలిపించారు. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా పోరాడిన చేజ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.