Cricket in USA : అంతర్జాతీయ క్రీడల్లో దాదాపు అన్ని క్రీడల్లోనూ అమెరికా స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఉంటుంది. ఒలింపిక్స్(Olympics) అయినా ప్రపంచకప్ లాంటి మెగా ఈవెంట్‌లలో అయినా అగ్రరాజ్యం తన ప్రభావాన్ని బలంగా చాటుతుంది. కానీ ఒక్క క్రికెట్‌లో మాత్రం కొన్ని దశాబ్దాలుగా అమెరికా(USA) పేరే వినపడ లేదు. కానీ ఇప్పుడు ఇవన్నీ మారాయి. ప్రపంచ క్రికెట్(World Cricket)లో సత్తా చాటేందుకు అగ్రరాజ్యం అమెరికా తన ప్రయాణాన్ని ప్రారంభించింది.
టీ 20 ప్రపంచకప్‌లో కెనడాపై తొలి విజయం సాధించి క్రికెట్‌లోకి తన ఆగమనాన్ని ఘనంగా చాటింది. అసలు క్రికెట్‌లో అమెరికా ఏంటి అనే విమర్శలకు అగ్రరాజ్యం గట్టిగానే బదులిచ్చింది. అసలు బేస్‌బాల్ ఆడే అమెరికాకు క్రికెట్ ఎందుకు అని హేళనగా మాట్లాడిన వారందరికీ టీ 20 ప్రపంచకప్ అర్హత మ్యాచుల్లో గెలుపొంది మహా సంగ్రామనికి అర్హత సాధించి అమెరికా గట్టిగానే బదులు చెప్పింది. ఇప్పుడు పొట్టి ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లో కెనడా నిర్దేశించిన 194 పరుగుల లక్ష్యాన్ని మరో 14 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి... తాము పసికూన ముద్రను వదిలించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చాటి చెప్పింది. ఈ ప్రపంచకప్‌లో అమెరికా మరో రెండు అద్భుతాలైనా సృష్టిస్తే ప్రపంచ క్రికెట్‌లో అగ్రరాజ్యం అరంగేట్రం ఘనంగా జరిగినట్లే.
బంగ్లాతో సిరీస్ దక్కించుకుని..
అంతర్జాతీయ క్రికెట్‌లో బంగ్లాదేశ్ (Bangladesh) ఇప్పుడు పసికూన కాదు. అగ్రశ్రేణి జట్లపై కూడా విజయాలు సాధించి సత్తా చాటుతోంది. అలాంటి బంగ్లాదేశ్‌పై అమెరికా టీ 20 సిరీస్‌ను కైవసం చేసుకుని అబ్బురపరిచింది. ఈ టీ20 ప్రపంచకప్‌నకు ముందు బంగ్లాదేశ్ జట్టుతో అగ్రరాజ్యం మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడింది. ఇందులో అద్భుత ఆటతీరు ప్రదర్శించి 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్ విజయంతో అమెరికా క్రికెట్‌లో అద్భుతాలు సృష్టించగలదని మాజీలు, క్రికెట్ నిపుణులు అంచనా వేశారు. దానికి తగ్గట్లే తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించి అమెరికాలో క్రికెట్ భవిష్యత్తుపై అగ్రరాజ్యం అంచనాలను పెంచేసింది. అమెరికాలో క్రీడలు నిర్వహిస్తుండడం కూడా ఆ దేశానికి కలిసి రానుంది. కటీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లకు టెక్సస్‌లోని గ్రాండ్ ప్రేరీ స్టేడియం, ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్‌లు వేదికగా మారాయి. ఇక్కడ క్రికెట్ మ్యాచులు జరుగుతుండడంతో అమెరికాలో ఇక క్రికెట్ ఫీవర్ పెరుగుతుందని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు.
భారత సంతతి ఆటగాళ్ల ఆధిపత్యం
టీ 20 ప్రపంచకబప్‌లో అమెరికా ప్రకటించిన జట్టులో సగం మంది భారత సంతతికి చెందిన ఆటగాళ్లే సగం మంది ఉన్నారు. కెప్టెన్ మోనాంక్ పటేల్‌తో పాటు సౌరభ్ నేత్రావల్కర్, హర్మీత్ సింగ్, మిలింద్ కుమార్, నిసార్గ్ పటేల్‌కు అమెరికా ప్రపంచకప్ స్క్వాడ్‌లో చోటుదక్కింది. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ కోరే అండర్సన్ కూడా ఈ జట్టులో ఉన్నాడు. దీంతో అమెరికా కాస్త బలంగానే కనిపిస్తోంది. ఇప్పటికే తొలి మ్యాచ్ ఆడి విజయం సాధించిన అమెరికా జూన్ 6వ తేదీన పాకిస్థాన్‍తో, జూన్ 12న భారత్‌తో తలపడనుంది. అలాగే ఈ టోర్నీలో తన చివరి మ్యాచ్‌ను జూన్ 14న ఫ్లోరిడాలో ఐర్లాండ్ ఆడనుంది.