PAK vs NZ Semi final: ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ 2022 తొలి సెమీ ఫైనల్‌ రసవత్తరంగా సాగుతోంది. మందకొడిగా ఉన్న సిడ్నీ పిచ్‌పై న్యూజిలాండ్‌ డిఫెండ్‌ చేసుకోగల స్కోర్‌ సాధించింది. పాకిస్థాన్‌కు 153 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. డరైల్‌ మిచెల్‌ (53*; 35 బంతుల్లో 3x4, 1x6), కేన్‌ విలియమ్సన్‌ (46; 42 బంతుల్లో 1x4, 1x6) రాణించారు. ఆడేందుకు కష్టంగా ఉన్న పిచ్‌పై నిలబడ్డారు. షాహిన్‌ అఫ్రిది 2 వికెట్లు పడగొట్టాడు.






మిచెల్‌కు అండగా కేన్‌


ఇప్పటికే ఉపయోగించిన పిచ్‌, మందకొడిగా ఉండటంతో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. 4 పరుగుల వద్దే ఫిన్‌ అలెన్‌ (4) వికెట్‌ పోగొట్టుకుంది. పాక్‌ బౌలర్లు స్లో బంతులతో విరుచుకుపడటంతో డేవాన్‌ కాన్వే (21), కేన్‌ విలియమ్సన్‌ (46) ఆచితూచి ఆడారు. బంతికో పరుగు చొప్పున చేశారు. ఈ జోడీ 32 బంతుల్లో 34 రన్స్‌ భాగస్వామ్యం నెలకొల్పింది. కీలక సమయంలో కాన్వే రనౌట్‌ కావడం, గ్లెన్‌ ఫిలిప్స్‌ (6) ఔటవ్వడంతో కివీస్‌ కష్టాల్లో పడింది.


ఈ సిచ్యువేషన్‌లో కేన్‌ అండతో డరైల్‌ మిచెల్‌ ఎదురుదాడికి దిగాడు. సింగిల్స్‌, డబుల్స్‌ తీస్తూనే దొరికిన బంతిని బౌండరీకి పంపించాడు. దాంతో 14.3 ఓవర్లకు స్కోరు 100 చేరుకుంది. 50 బంతుల్లో 68 భాగస్వామ్యం అందించిన ఈ జోడీని కేన్‌ను ఔట్‌ చేయడం ద్వారా అఫ్రిది విడదీశాడు. అప్పడు  స్కోరు 117. మిచెల్‌ 32 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. నీషమ్‌ (16)తో కలిసి బౌండరీలు బాదేదామన్నా పాక్‌ బౌలర్లు చక్కగా బౌలింగ్‌ చేయడంతో కివీస్‌ 152/4కు పరిమితమైంది.