IND vs ENG Semi-Final: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 సెమీస్ ముగింట టీమ్‌ఇండియాకు వరుస షాకులు తగులుతున్నాయి! అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ గాయపడ్డాడని తెలిసింది. భారత్ అడిలైడ్‌లో నేడు సాధన చేసింది. నెట్ ప్రాక్టీస్ చేస్తుండగా హర్షల్ పటేల్ వేసిన బంతి విరాట్ చేతికి తగిలింది. దాంతో వెంటనే అతడు మైదానం వీడాడని తెలిసింది. గాయం తీవ్రత గురించి ఇప్పటికైతే ఎలాంటి అప్‌డేట్ లేదు. అయితే ఆందోళన చెందాల్సిన స్థాయిలో లేదని సమాచారం.
విరాట్ కోహ్లీకి గాయమైందని తెలియడంతో కోట్లమంది అభిమానుల గుండెలు గుభేలుమన్నాయి! ఈ టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా తరఫున టాప్ స్కోరరే అతడే. 5 మ్యాచుల్లో 246 పరుగులు చేశాడు. బంతి తగిలిన వెంటనే విరాట్ నొప్పితో విలవిల్లాడాడు. ఫిజియో అతడిని పరీక్షించాడు. ప్రమాదమేమీ లేదని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విరామం తీసుకున్నాక నొప్పి తగ్గడంతో మళ్లీ కింగ్ కోహ్లీ సాధన చేశాడు. ప్రాక్టీసులో ఎలాంటి ఇబ్బంది పడలేదు. ఒకవేళ అతడి గాయం తీవ్రమై ఉంటే ఇదో పెద్ద విపత్తుగా మారేది.
మంగళవారం చేసిన సాధనలో రోహిత్‌శర్మ గాయపడ్డ సంగతి తెలిసిందే. త్రో డౌన్ స్పెషలిస్ట్ విసిరిన బంతి ఆడే క్రమంలో హిట్‌మ్యాన్ గాయపడ్డాడు. ఓ బంతి అతడి కుడి చేతికి తగిలింది. నొప్పితో విలవిల్లాడిన హిట్‌మ్యాన్ అక్కడే కూలబడ్డాడు. దాంతో అందరి ముఖాల్లోనూ ఆందోళన కనిపించింది. ఫిజియో వచ్చి మ్యాజిక్ స్ప్రే చల్లాడు. అరగంట వరకు నెట్స్‌లోనే కూర్చున్న రోహిత్ తర్వాత సాధన చేయడంతో జట్టులో కలవరపాటు తగ్గింది. హోటల్‌కు వచ్చే ముందు తనకు అంతా బాగానే ఉన్నట్టు కెప్టెన్ థంప్స్ అప్ గుర్తు చూపించాడు.