Kevin Peterson on Kohli:  గురువారం ఇంగ్లండ్ తో జరిగే సెమీఫైనల్ మ్యాచుకు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెలవు తీసుకోవాలని.. ఆ జట్టు మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ కోరాడు. ఈ మేరకు కోహ్లీకి సరదా అభ్యర్థన పంపాడు.


టీ20 ప్రపంచకప్ లో భాగంగా నవంబర్ 10న జరిగే సెమీఫైనల్ మ్యాచులో భారత్, ఇంగ్లండ్ ను ఢీకొనబోతోంది. దీనికోసం టీమిండియా ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగే కోహ్లీ నెట్స్ లో చెమటోడుస్తున్నాడు. తాను నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను కోహ్లీ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీనిపై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ సరదాగా స్పందించాడు. తమ జట్టుతో జరిగే నాకౌట్ మ్యాచుకు విరాట్ కోహ్లీ సెలవు తీసుకోవాలని కోరాడు. రేపటి మ్యాచ్ ఆడకుండా విశ్రాంతి తీసుకోవాలని కోహ్లీని సరదాగా అభ్యర్థించాడు. 


ఈ మెగా టోర్నీలో విరాట్ కోహ్లీ విజృంభించి ఆడుతున్నాడు. సూపర్- 12 దశలో దాదాపు అన్ని మ్యాచుల్లోనూ రాణించాడు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. సీనియర్ బ్యాటర్ గా నిలకడగా ఆడుతూ ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్ లో పరుగుల పరంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సెమీఫైనల్లోనూ ఇదే జోరు చూపించి జట్టును ఫైనల్ కు తీసుకెళ్లాలని అభిమానులు కోరుకుంటున్నారు.  


విరాట్ కోహ్లీతో పీటర్సన్ కు మంచి అనుబంధం ఉంది. ఆ మధ్య విరాట్ ఫామ్ కోల్పోయి పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు పీటర్సన్ కోహ్లీకి మద్దతుగా మాట్లాడాడు. ఈ క్రమంలోనే పీటర్సన్ కోహ్లీని అలా అభ్యర్థించాడు.


ప్రాక్టీసులో కెప్టెన్ రోహిత్ కు గాయం


సెమీఫైనల్ మ్యాచ్ జరిగే అడిలైడ్‌లో టీమ్‌ఇండియా ప్రాక్టీస్ చేస్తోంది. ఆటగాళ్లంతా హుషారుగా సాధన చేస్తున్నాడు. త్రో డౌన్‌ స్పెషలిస్టు నేతృత్వంలో రోహిత్ శర్మ  బ్యాటింగ్‌ చేశాడు. అయితే ఓ బంతి అతడి కుడి చేతికి తగిలింది. నొప్పితో విలవిల్లాడిన హిట్‌మ్యాన్‌ అక్కడే కూలబడ్డాడు. దాంతో అందరి ముఖాల్లోనూ ఆందోళన కనిపించింది. ఫిజియో వచ్చి మ్యాజిక్‌ స్ప్రే చల్లాడు. అరగంట వరకు నెట్స్‌లోనే కూర్చున్న రోహిత్‌ తర్వాత సాధన చేయడంతో జట్టులో కలవరపాటు తగ్గింది. హోటల్‌కు వచ్చే ముందు తనకు అంతా బాగానే ఉన్నట్టు కెప్టెన్‌ థంప్స్‌ అప్‌ గుర్తు చూపించాడు.