Ashwin Viral Video:

  సోషల్ మీడియాలో ప్రస్తుతం భారత బౌలర్ అశ్విన్ వీడియో ఒకటి వైరల్ గా మారింది. జెర్సీలను వాసన చూస్తూ కనిపిస్తున్న అశ్విన్ ను చూసి అభిమానులు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అసలేమైందంటే..


టీ20 ప్రపంచకప్ లో భారత్- జింబాబ్వే మధ్య చివరి సూపర్- 12 మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచుకు ముందు టాస్ వేసే సమయంలో ప్రాక్టీస్ చేస్తున్న కొందరు ఆటగాళ్లు మైదానం వీడారు. అదే సమయంలో అశ్విన్ జెర్సీలను వాసన చూస్తూ తనదో కాదో నిర్ధారించుకుంటూ కనిపించాడు. మ్యాచ్ సమయంలో ఆ సంఘటనను ఎవరూ గుర్తించకపోయినా.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో నవ్వులు పూయిస్తోంది. దానిపై అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇది దుస్తులను గుర్తించే అసలైన విధానం అంటూ ఓ నెటిజన్ స్పందించాడు. చలికాలంలో బట్టలు ఉతికేటప్పుడు నేను ఇలానే గుర్తిస్తా. ఇది భారత్ లో సర్వసాధారణం అంటూ ఇంకొక యూజర్ కామెంట్ చేశాడు.


ఇదిలా ఉంటే ఈ వీడియోపై అశ్విన్ స్పందించాడు. సైజును బట్టి వేరు చేయడానికి కాదు. నేను మొదటిసారి వేసుకున్నది అదేనా అని చెక్ చేయడానికి కాదు. నేను వాడే పెర్ఫ్యూమ్ అదేనా కాదా అని చెక్ చేస్తున్నా. అంటూ ట్విటర్ లో తెలిపాడు. ఈ మ్యాచులో భారత్ విజయం సాధించింది. అశ్విన్ 3 వికెట్లు తీశాడు. 


ఇంగ్లండ్ తో సెమీస్


గ్రూప్ బీ నుంచి అగ్రస్థానంతో సెమీస్ చేరుకున్న టీమిండియా.. నవంబర్ 10న ఇంగ్లండ్ తో తలపడనుంది. ఆ మ్యాచులో గెలిస్తే ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. దీనికోసం భారత జట్టు ముమ్మరంగా సాధన చేస్తోంది. 


కెప్టెన్ రోహిత్ కు గాయం!


అడిలైడ్‌లో టీమ్‌ఇండియా ఉదయమే ప్రాక్టీస్‌కు దిగింది. ఆటగాళ్లంతా హుషారుగా సాధన చేశారు. త్రో డౌన్‌ స్పెషలిస్టు నేతృత్వంలో రోహిత్ శర్మ  బ్యాటింగ్‌ చేశాడు. అయితే ఓ బంతి అతడి కుడి చేతికి తగిలింది. నొప్పితో విలవిల్లాడిన హిట్‌మ్యాన్‌ అక్కడే కూలబడ్డాడు. దాంతో అందరి ముఖాల్లోనూ ఆందోళన కనిపించింది. ఫిజియో వచ్చి మ్యాజిక్‌ స్ప్రే చల్లాడు. అరగంట వరకు నెట్స్‌లోనే కూర్చున్న రోహిత్‌ తర్వాత సాధన చేయడంతో అభిమానులు ఊపరి పీల్చుకున్నారు. హోటల్‌కు వచ్చే ముందు తనకు అంతా బాగానే ఉన్నట్టు కెప్టెన్‌ థంప్స్‌ అప్‌ గుర్తు చూపించాడు. టీమ్‌ఇండియా టీ20 వరల్డ్‌ కప్‌ గెలవాలంటే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఎంతో కీలకం. ఇప్పటి వరకు అతడు 89 పరుగులే చేసినప్పటికీ తన ఫీల్డింగ్‌, కెప్టెన్సీ, వ్యూహాలతో ఆకట్టుకున్నాడు. తీవ్ర ఉత్కంఠ రేపిన మ్యాచుల్లో ఫీల్డర్లు, బౌలర్లను మారుస్తూ ప్రత్యర్థులను దెబ్బకొట్టాడు. పరుగుల పరంగా వెనకే ఉన్నా అతడు నిలబడితే ఎంత విధ్వంసకరంగా ఆడతాడో తెలిసిందే. ఇంగ్లాండ్‌ వంటి భీకరమైన జట్టుపై సెమీస్‌ గెలవాలంటే హిట్‌మ్యాన్‌ నాయకత్వం అత్యవసరం.