Pak Vs USA: టీ20 వరల్డ్ కప్-2024 (T20 World Cup) పాకిస్థాన్ (Pakistan)పై అమెరికా సంచలన విజయాన్ని నమోదు చేసింది. సూపర్ ఓవర్‌లో మాజీ ఛాంపియన్ పాకిస్తాన్ ను మట్టికరిపించడానికి యూఎస్‌ఏ ఆల్‌రౌండ్ షో చేసింది. అయితే ఈ గెలుపులో భారత సంతతికి చెందిన ఆటగాళ్లదే కీలక పాత్ర. సహజంగానే అమెరికా జట్టులో ఇండియన్ మూలాలున్న ఆటగాళ్ళే అన్న విషయం మనకి తెలిసినదే. యూఎస్‌ఎ కెప్టెన్ మోనాంక్ పటేల్‌తో పాటు సౌరభ్ నేత్రావల్కర్, హర్మీత్ సింగ్, మిలింద్ కుమార్, నిసార్గ్ పటేల్ వంటి ఆటగాళ్లు భారత మూలాలు ఉన్నవారే.
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో బుడి బుడి అడుగులు వేస్తోంది అని భావించిన అమెరికా జట్టు గత ఛాంపియన్ పాకిస్తాన్ కు ఊహించని షాకిచ్చింది. పాకిస్తాన్‌పై అమెరికా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. తరువాత 160 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ కు దిగిన అమెరికా 3 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అవ్వగా సూపర్ ఓవర్‌లో ఫలితాన్ని నిర్ణయించాల్సివచ్చింది.
సూపర్ ఓవర్‌లో అదరగొట్టిన సూపర్ హీరో ..
సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా 18 పరుగులు చేయగా, ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు 1 వికెట్ కోల్పోయి 13 పరుగులు మాత్రమే చేసింది. పాకిస్తాన్ సూపర్ ఓవర్ వేసిన పేసర్ మహ్మద్ అమీర్ ఎక్స్‌ట్రాస్ రూపంలోనే ఏకంగా 7 పరుగులివ్వగా, అమెరికా తరపున సూపర్ ఓవర్ బౌలింగ్ చేసిన సౌరభ్ నేత్రావల్కర్ కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
భారత్‌కు చెందిన సౌరభ్ నరేశ్ నేత్రావల్కర్ 1991 అక్టోబరు 16న ముంబయిలో పుట్టాడు. 2010లో భారత్ తరఫున అండర్ -19 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, హర్షల్ పటేల్, జయ్‌దేవ్ ఉనద్కత్, సందీప్ శర్మ వంటి ఆటగాళ్లతో కలిసి ఆడాడు. కొంతకాలం ముంబయికి రంజీల్లో ప్రాతినిధ్యం వహించినా, ప్రొఫెషనల్ క్రికెట్‌లో అవకాశాలు లేకపోవడంతో చదువుపై దృష్టి పెట్టాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేరాడు. అయితే ఆటపై ఇష్టాన్ని వదులుకోలేక అమెరికా జాతీయ జట్టులో చోటు దక్కించుకుని 2019లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై తొలి మ్యాచ్ ఆడాడు. అమెరికా జట్టుకు కొంతకాలం కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. ఇప్పటి వరకు 48 వన్డేలు, 29 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ప్రస్తుతానికి ఈ సూపర్ ఓవర్ హీరో పోస్ట్ లు వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
ఇది రీవెంజే..
2010లో అండర్19 జట్టుకు ఆడినప్పుడు పాకిస్తాన్ జట్టు చేతిలో ఇండియా ఓడిపోయింది. అప్పుడు యువ బాబర్ పాకిస్తాన్ కెప్టెన్ గా ఉన్నాడు. అయితే ఆ టోర్నీలో టీమ్‌ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు సౌరభ్ నేత్రావల్కర్ . మొత్తం ఆరు మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టాడు. కానీ ఆ మ్యాచ్ లో ఇండియా ఓడిపోయింది . అప్పుడు ఇండియాకు ఆడిన నేత్రావల్కర్ ఇప్పుడు 14 ఏళ్ల తర్వాత పాక్‌ను ఓడించి కసి తీర్చుకున్నాడు.