India Vs Pak Match Updates: టీ20 వరల్డ్ కప్‌-2024(T20 World Cup)లో  భారత్(Team India) అద్భుతంగా ప్రారంభించింది. న్యూయార్క్ నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి తొలివిజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక తరువాత  గ్రూప్-ఏలో భాగంగా భారత్  తన తదుపరి మ్యాచ్‌ను ఆదివారంనాడు  పాకిస్థాన్‌తో ఆడనుంది. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్‌ వేదిక మార్చాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే జూన్ 9న జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు వివాదాస్పద నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియమే ఆతిథ్యం ఇవ్వనుంది.


మండిపడుతున్న మాజీలు 


టీ 20 ప్రపంచకప్‌  మెగా టోర్నీల్లో వాడుతున్న ఈ డ్రాప్ ఇన్ పిచ్  (Drop In Potch )ఆటగాళ్ళను ఇబ్బందులు పెడుతోంది.  పిచ్‌పై అస్థిరమైన బౌన్స్‌ కనపడుతుండటంతో బ్యాటర్లు పరుగులు చేయడానికి తీవ్రంగా కష్టపడుతున్నారు. పిచ్‌పై బ్యాటింగ్, బౌలింగ్‌కు మధ్య బ్యాలెన్స్ సరిగ్గా లేకపోవడం, సెకండ్ బ్యాటింగ్ చేసేవారికి ఎక్కువ సానుకూలత ఉండడంపై క్రికెట్ నిపుణుల నుంచి ఫ్యాన్స్ వరకు తీవ్రంగా మండిపడుతున్నారు.  మరోవైపు ఐర్లాండ్‌(Ireland)తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్(Rohit Sharma) రిటైర్ హర్ట్‌గా వెనుదిరగడానికి కారణం కూడా ఈ పిచ్చే.  ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని మాజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  పిచ్‌ చాలా పేలవంగా  కనిపించిందని  చెబుతున్నారు. ఇలాంటి పిచ్‌పై బ్యాటింగ్ చేయడం ఆటగాళ్లకు పెద్ద సవాల్‌ అని , ప్రపంచకప్‌లాంటి పెద్ద టోర్నీల్లో ఇలాంటి నాసిరకం పిచ్‌ ఏర్పాటు చేయడంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ మండిపడ్డారు.  అమెరికన్‌ ప్రేక్షకులను టెస్ట్‌ క్రికెట్‌కు అలవాటు చేయాలని ఇలాంటి పిచ్‌ హడావిడిగా  తయారు చేసి ఉంటారని టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్‌ ఎద్దేవా చేశాడు. న్యూయార్‌ పిచ్‌ ఒక మంత్రగత్తెలా ఉందని నవజ్యోత్‌ సిద్ధూ విమర్శించారు. ఇర్ఫాన్‌ పఠాన్‌ కూడా  పిచ్ పై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇక ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే  అయితే ఇలాంటి పిచ్ పై భారత్-పాక్ మ్యాచ్‌ను ఊహించుకోవడం కష్టం అన్నాడు.


నసావు పిచ్ పై ఐసీసీ ఏమందంటే ? 


అటు ఆటగాళ్ళు, ఇటు అభిమానులు తీవ్రంగా ఆరోపణలు చేస్తుండటంతో నసావు పిచ్‌పై ఐసీసీ స్పందించింది.  నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇప్పటివరకు ఉపయోగించిన పిచ్‌లపై ఎక్కువ మ్యాచ్ లు ఆడకపోవడమే ఇందుకు కారణమని భావిస్తున్నామంది. అయినా భారత్ vs  ఐర్లాండ్ మ్యాచ్  తరువాత నుంచి ప్రపంచ స్థాయి గ్రౌండ్స్ బృందాలు పరిస్థితిని సరిదిద్ది, ఈ వేదికను సరైన పిచ్ గా మార్చేందుకు కృషి చేస్తున్నాయని వెల్లడించింది. 


ఈ ప్రపంచ కప్ లో న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా మొత్తం 8 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తవ్వగా ( SL Vs SA) , (IND VS IRE), జూన్ 7న అంటే ఈ రోజు  ఐర్లాండ్‌ వర్సెస్ కెనడా(IRE Vs CAN),  జూన్ 8న దక్షిణాఫ్రికా వర్సస్ నెదర్లాండ్స్‌(SA Vs NED) తలపదనున్నాయి.  ఇక జూన్ 9న క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్(India vs Pakistan) జట్ల మధ్య దాయాదుల పోరుకు కూడా ఇదే మైదానం వేదిక కానుంది.  ఆ తర్వాత జూన్ 10న దక్షిణాఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్(South Africa. vs Bangladesh) , జూన్ 11న పాకిస్తాన్ వర్సెస్ కెనడా(Pakistan vs Canada), జూన్ 10న అమెరికా, ఇండియా(United States vs India) జట్ల మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి.

 

మ్యాచ్ రద్దుకు అవకాశం ఉందా?

 

అయితే ఇలా పిచ్ లో  అస్థిర బౌన్స్ కనపడటం కానీ , ఆటగాళ్లకు ప్రమాదకరంగా ఉంది అని అంపైర్లు భావిస్తే మ్యాచ్‌ను రద్దు చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇటీవల బిగ్ బాష్ లీగ్‌లో ఓ మ్యాచ్‌ను ఇలాంటి కారణంగానే రద్దు చేసారు. మ్యాచ్ ప్రారంభమై 6.5 ఓవర్ల అనంతరం రద్దు చేస్తూ ప్రకటించారు. ఇప్పుడు  భారత్-పాక్‌ మ్యాచ్‌లోనూ ఇలాంటి  సీనే రిపీట్ అవుతుందేమో  అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.