Babar Azam React on Pakistan Defeat against United States:  ఆర్మీతో కఠిన శిక్షణ... క్రికెట్‌ బోర్డులో సంస్కరణలు... మళ్లీ బాబర్‌(Babar Azam)కే కెప్టెన్సీ పగ్గాలు ఇదీ టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup)నకు ముందు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు(PCB)లో జరిగిన కీలక మార్పులు.. ఇన్ని జరిగినా పాక్‌ ఆటతీరు మాత్రం మారలేదు. టీ 20 ప్రపంచకప్‌లో ఆతిథ్య అమెరికా(USA) చేతిలో పరాజయం పాలై పాకిస్థాన్‌(Team Pakistan) మరోసారి అప్రతిష్ట మూటగట్టుకుంది. తొలుత మ్యాచ్‌ టై అయి అవకాశం వచ్చినా సూపర్‌ ఓవర్‌లో పాక్‌ విఫలమైంది. ఒత్తిడికి చిత్తవుతూ మ్యాచ్‌ను అమెరికాకు అప్పగించేసింది. సూపర్‌ ఓవర్‌లో అమెరికా 18 పరుగులు చేయగా అందులో ఏడు పరుగులు ఎక్స్‌ ట్రా రూపంలోనే వచ్చాయి. ఒత్తిడిలో పాక్‌ బౌలర్‌ ఇఫ్తికార్‌ అహ్మద్‌ పూర్తిగా తేలిపోయాడు. ఫీల్డర్‌ కూడా చురుగ్గా కదలకపోవడంతో అమెరికా విజయం సాధించింది. 


పాక్‌ తీరు మారదా

ఒక మ్యాచ్‌లో అద్భుతంగా ఆడడం... ఆ తర్వాతి మ్యాచ్‌లో పేలవంగా ఆడే జట్టుగా పాక్‌కు పేరొంది. అందుకే పాక్‌ ఏ మ్యాచ్‌ ఎప్పుడు ఎలా ఆడుతుందో అంచనా వేయడం కష్టమని మాజీ క్రికెటర్లు అంటారు. ఒక మ్యాచ్‌లో అద్భుతాలు చేసే పాక్‌ ఆటగాళ్లు... మరో మ్యాచ్‌లో దారుణంగా విఫలమవుతారు. ఇలా అనిశ్చితికి పాక్‌ మారుపేరుగా మారిపోయింది. టీ 20 ప్రపంచకప్‌నకు ముందు కూడా పాక్‌ వరుసగా విఫలమైంది. పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. అనంతరం సెలక్షన్‌ బోర్డు నుంచి క్రికెట్‌ బోర్డులోనూ అనేక మార్పులు చేశారు. ఆటగాళ్లను మరింత రాటుదేల్చేందుకు పాక్‌ ఆర్మీ వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చింది. అప్పుడు పాక్‌ ఆటగాళ్లకు ఆర్మీ ఇస్తున్న శిక్షణ వీడియోలు సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌గా మారాయి. భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో దారుణంగా విఫలమైన తర్వాత పాక్‌ కెప్టెన్‌గా ఉన్న బాబర్‌ ఆజమ్‌ను కెప్టెన్‌గా తొలగించారు. అయినా పాక్‌ కష్టాలు తీరలేదు. వరుస పరాజయాలతో పాక్‌ కుంగిపోయింది. ఆ తర్వాత మళ్లీ టీ 20 ప్రపంచకప్‌నకు ముందు బాబర్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించి... అతడి నేతృత్వంలోనే అమెరికాకు పంపారు. ఇప్పుడు  ఆడిన తొలి మ్యాచ్‌లనే పసికూన అమెరికా చేతిలో పాక్‌ మట్టికరిచింది. ఒకసారి మ్యాచ్‌ టై అయి సూపర్‌ ఓవర్‌ రూపంలో అవకాశం దక్కినా పాక్‌  దాన్ని కూడా జారవిడుచుకుని తీవ్ర అప్రతిష్ట మూటకట్టుకుంది.

 

బౌలింగ్‌ వైఫల్యమే కారణం: బాబర్‌

పరిస్థితులను అంచనా వేయడంలో విఫలమయ్యామని అందుకే టీ 20 తొలి మ్యాచ్‌లో అమెరికా చేతిలో ఓడిపోయామని మ్యాచ్‌ అనంతరం పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ తెలిపాడు. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచినా ఓటిమి తప్పలేదన్నాడు. మొదట బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు పవర్‌ ప్లేను తాము సరిగ్గా సద్వినియోగం చేసుకోలేదని బాబర్‌ తెలిపాడు. వరుసగా వికెట్లు కోల్పోవడం తమను దెబ్బ తీసిందని వివరించారు. తమ స్పిన్నర్లు కూడా మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేదని.. ఇవే ఓటమికి ప్రధాన కారణాలనీ బాబర్‌ తెలిపాడు. ఈ విజయంతో క్రెడిట్ మొత్తం అమెరికాదే అన్న బాబర్‌.. వారు తమ కంటే మెరుగ్గా ఆడారని తెలిపాడు. టాస్ గెలిచి, మొదటి 6 ఓవర్లలో పాక్‌ను కట్టడి చేసినప్పుడే విజయంపై ధీమా వచ్చిందని అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ తెలిపాడు. వరుసగా వికెట్లు తీయడం కూడా తమకు కలిసి వచ్చిందని తెలిపాడు. ప్రపంచ కప్‌లో ఆడే అవకాశం అందరికీ రాదని దానిని వినియోగించుకుంటున్నామని పటేల్‌ వివరించాడు.