USA beat Pakistan in Dallas via Super Over: టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup)లో పెను సంచలనం నమోదైంది. మాజీ ఛాంపియన్‌ పాకిస్థాన్‌(Pakistan)కు ఆతిథ్య అమెరికా(USA) దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలీని పాక్‌ జట్టును అమెరికా సూపర్‌ ఓవర్‌ వరకూ పోరాడి మట్టికరిపించింది. ఏ దశలోనూ మ్యాచ్‌పై ఆశలు వదులుకోకుండా పోరాడి తొలుత మ్యాచ్‌ను టై చేసిన అమెరికా... ఆ తర్వాత సూపర్‌ ఓవర్‌లో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించి గట్టి షాక్‌ ఇచ్చింది. గ్రూప్‌ ఏలో భాగంగా డల్లాస్‌( Dallas) వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా సరిగ్గా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 159 పరుగులే చేయడంతో మ్యాచ్‌ టై అయింది. చివరి బంతికి విజయానికి అయిదు పరుగులు అవసరంకాగా... అమెరికా బ్యాటర్‌ ఫోర్‌ కొట్టాడు. దీంతో మ్యాచ్‌ టై అయింది. అనంతరం నిర్వహించిన సూపర్‌ ఓవర్‌లో అమెరికా ఘన విజయం సాధించింది.


 

పాక్‌ బ్యాటర్ల కట్టడి

     ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన అమెరికా... తొలుత పాక్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.  ఆరంభం నుంచే కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన అమెరికా బౌలర్లు... పాక్‌ బ్యాటర్లను స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేయనివ్వలేదు.  రెండో ఓవర్‌లోనే మహ్మద్‌ రిజ్వాన్‌(Mohammad Rizwan)ను అవుట్‌ చేసిన నేత్రావల్కర్‌ పాక్‌కు షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత కాసేపటికే ఉస్మాన్‌ ఖాన్‌ కూడా మూడు పరుగులే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత ఫకర్‌ జమాన్‌ 11 పరుగులే చేసి అలీ ఖాన్‌ బౌలింగ్‌లో అవుయ్యాడు. దీంతో పాక్‌ 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ  షాదాబ్ ఖాన్ 25 బంతుల్లో 40.. కెప్టెన్ బాబర్ అజామ్(Babar Azam) 43 బంతుల్లో 44 పరుగులు చేయడంతో పాక్‌ కోలుకుంది. కానీ కీలక సమయంలో బాబర్‌ ఆజమ్‌.. షాదాబ్‌ ఖాన్‌ అవుటయ్యారు. ఎదుర్కొన్న తొలి బంతికే ఆజామ్‌ ఖాన్‌ డకౌట్‌ కావడంతో పాక్‌ భారీ స్కోరు చేసే అవకాశాన్ని కోల్పోయింది. కానీ ఇఫ్తికార్ అహ్మద్‌ 18, షహీన్‌ షా అఫ్రీదీ 23 పరుగులు చేయడంతో పాక్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 

 

రాణించిన అమెరికా బ్యాటర్లు

అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా సరిగ్గా 159 పరుగులే చేయడంతో మ్యాచ్‌ టై అయింది. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలింగ్‌ దళంగా పేరున్న పాక్‌ బౌలర్లను అమెరికా బ్యాటర్లు సునాయసంగా ఎదుర్కొన్నారు. ఓపెనర్లు 36 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం తొలి వికెట్‌కు మోనాంక్‌ పటేల్‌.. అండ్రీస్‌ గోస్‌ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. మోనాంక్‌ పటేల్‌ 50 పరుగులు.. అండ్రీస్‌ గోస్‌  35 పరుగులు చేసి అవుటయ్యారు. అనంతరం ఆరోన్‌ జోన్స్‌ 36, నితీశ్‌ కుమార్‌ 14 పరుగులతో చివరి వరకు క్రీజులో ఉండడంతో మ్యాచ్‌ టైగా ముగిసింది. చివరి మూడు బంతుల్లో 12 పరుగులు అవసరం కాగా రవూఫ్ బౌలింగ్‌లో జోన్స్  సిక్సర్‌కి కొట్టాడు. అనంతరం సింగిల్ తీశాడు. ఇక చివరి బంతికి విజయానికి అయిదు బంతులు అవసరంకాగా నితీశ్‌కుమార్‌ ఫోర్‌ కొట్టాడు. దీంతో సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది.

 

సూపర్‌ ఓవర్‌ సాగిందిలా...

అనంతరం సూపర్‌ ఓవర్‌ నిర్వహించగా తొలుత బ్యాటింగ్‌ చేసిన అమెరికా... ఆరు బంతుల్లో ఒక వికెట్ నష్టపోయి 18 పరుగులు చేసింది. ఈ 18 పరుగుల్లో ఏడు పరుగులు ఎక్స్‌ ట్రాల రూపంలోనే వచ్చాయంటే ఒత్తిడికి పాక్‌ బౌలర్లు ఎలా చిత్తయ్యారో అర్ధం చేసుకోవచ్చు. అనంతరం 19 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌... కేవలం 13 పరుగులకే పరిమితమైంది. దీంతో ఆరు పరుగుల తేడాతో పాక్‌పై గెలిచి అమెరికా చరిత్ర సృష్టించింది. 2007లో వెస్టిండీస్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ మూడు వికెట్ల తేడాతో ఓడిపోయి ఆ టోర్నీ నుంచి నిష్క్రమించింది. అమెరికా విజయం అనాటి మ్యాచ్‌ను మరోసారి గుర్తు చేసింది.