T20 World Cup Updates: టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-ఏ, గ్రూప్-బిల్లో సూపర్-8కి ఎవరు వెళ్తారు అనగానే టక్కున చెప్పేయచ్చు. కానీ గ్రూప్-సి పరిస్థితి మాత్రం అలా లేదు. న్యూజిలాండ్, వెస్టిండీస్‌లతో పాటు షార్ట్ ఫార్మాట్‌లో బలమైన ఆఫ్ఘనిస్తాన్ ఈ జట్టులో ఉంది. కాబట్టి గ్రూప్-సిలో త్రిముఖ పోరు నెలకొనే అవకాశం ఉంది. ఈ గ్రూప్‌లో ఏ జట్లు ఉన్నాయి? వాటి బలాలు, బలహీనతలు ఏంటి?


1. వెస్టిండీస్(West Indies)
టీ20ల్లో వెస్టిండీస్ జట్టు ఎప్పుడైనా బలంగానే కనిపిస్తుంది. ప్రపంచంలోని అన్ని క్రికెట్ లీగుల్లో వెస్టిండీస్ ఆటగాళ్లదే హవా నడుస్తూ ఉంటుంది. 2016లో ఒకసారి వీరు ట్రోఫీ కూడా గెలిచారు. ఆల్ రౌండర్లు, భారీ హిట్టర్లతో వెస్టిండీస్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. రొవ్‌మన్ పావెల్, షిమ్రన్ హెట్‌మేయర్, నికోలస్ పూరన్, ఆండ్రీ రసెల్, రొమారియో షెపర్డ్‌లతో భయపెట్టే బ్యాటింగ్ ఆర్డర్ వీరి సొంతం. కానీ వీరి ఆటలో కన్సిస్టెన్సీ లేకపోవడం మైనస్. కానీ ఈ ప్రపంచకప్ హాట్ ఫేవరెట్స్‌లో వెస్టిండీస్ కూడా ఒకటి.


2. న్యూజిలాండ్(New Zealand)
2022 టీ20 ప్రపంచకప్ జట్టుతో పోలిస్తే న్యూజిలాండ్ 2024 టీ20 ప్రపంచకప్ జట్టులో చాలా తక్కువ మార్పులు చేసింది. ఆ జట్టు కూర్పే న్యూజిలాండ్ బలం. పేపర్‌పై న్యూజిలాండ్ జట్టు చాలా బలంగా కనిపిస్తుంది. బ్యాటింగ్‌లో కేన్ విలియమ్సన్, ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, మార్క్ ఛాప్‌మన్, రచిన్ రవీంద్ర జట్టుకు కీలకం. బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్‌, టిమ్ సౌతీ, మిషెల్ శాంట్నర్, లాకీ ఫెర్గూసన్ ఇలా అంతా ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారే కనిపిస్తున్నారు. న్యూజిలాండ్ సూపర్-8కు చేరాలంటే సంచలనం నమోదవకుండా చూసుకుంటే చాలు.


3. ఆఫ్ఘనిస్తాన్(Afghanistan)

అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం ఆప్ఘనిస్తాన్ 10వ స్థానంలో ఉంది. దీన్ని బట్టి వారు భారీ విజయాలు సాధించగలరని ఆశలు పెట్టుకోవడంలో ఎటువంటి తప్పూ లేదు. పాకిస్తాన్ జట్టుపై ఏకంగా సిరీస్ కూడా గెలిచారు. రషీద్ ఖాన్, రహ్మనుల్లా గుర్బాజ్, మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రహమాన్, నవీన్ ఉల్ హక్... ఇలా ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన వారు ఆప్ఘన్ జట్టులో ఉన్నారు. ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్ బ్యాటింగ్2లో అద్బుతంగా రాణిస్తున్నారు.


4.  ఉగాండా(Uganda)
ఆఫ్రికన్ రీజియన్ క్వాలిఫయర్స్‌లో గెలిచి టోర్నమెంట్‌లో అడుగు పెట్టింది ఉగాండా. ఉగాండా ఆడిన చివరి 49 మ్యాచ్‌ల్లో ఏకంగా 41 విజయాలు సాధించింది. ఈ జట్టుపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ టీ20ల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కాబట్టి ప్రత్యర్థులు జాగ్రత్తగా ఉండాల్సిందే.


5. పపువా న్యూ గినియా(Papua New Guinea)
ఉగాండాలానే పపువా న్యూ గినియా కూడా క్వాలిఫయర్స్ ద్వారా టోర్నీలో అడుగుపెట్టింది. క్వాలిఫయర్స్‌లో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. జట్టులో ఆల్‌రౌండర్లు ఉండటం పపువా న్యూ గినియా బలం. మరి ఈ టోర్నమెంట్‌లో వీరు ఏమైనా సంచలనం సృష్టిస్తారేమో చూడాలి.