T20 WC 2022, IND vs PAK: ఐసీసీ టీ20 ప్రపంచకప్ గెలవాలంటే సరిచేసుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయని టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంటున్నాడు. నాకౌట్ దశ గురించి ఇప్పట్నుంచే ఆలోచించడం తొందరపాటే అవుతుందన్నాడు. పాకిస్థాన్ మ్యాచ్‌పై ఎక్కువ ఆసక్తి ఉంటుందని, ఆటగాళ్లంతా ప్రశాంతంగా ఉన్నారని పేర్కొన్నాడు. మెగా టోర్నీలో తొలిసారి కెప్టెన్సీ చేస్తున్నందుకు ఆనందంగా ఉందన్నాడు.
మోటివేషన్ అదే!
'మేం ప్రపంచకప్ గెలిచి చాన్నాళ్లైంది. అందుకే మా ఆలోచనా విధానం, ప్రేరణ ప్రపంచకప్ గెలవడం పైనే ఉంటుంది. ఇది జరగాలంటే మేం చాలా విషయాలు సరిచేసుకోవాలని తెలుసు. ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తాం. మేం అతిగా ఆలోచించడం లేదు. ఇప్పట్నుంచే సెమీస్, ఫైనల్ గురించి ఆలోచించడం సరికాదు. మ్యాచుకు ముందు తలపడే జట్టుపై దృష్టి సారిస్తే చాలు. సరైన దారిలో వెళ్లేందుకు అత్యుత్తమంగా సన్నద్ధమవుతాం' అని హిట్‌మ్యాన్ బీసీసీఐతో చెప్పాడు.
టీమ్‌ఇండియా ప్రతిసారీ ఫేవరెట్‌గానే బరిలోకి దిగుతుంది. అయినప్పటికీ 2011 తర్వాత ప్రపంచకప్ గెలవలేదు. గతేడాది యూఏఈ టీ20 ప్రపంచకప్‌లోనైతే నాకౌట్ దశకూ చేరలేదు. అయితే అప్పట్లాగే ఈ సారీ పాకిస్థాన్‌తోనే తొలి మ్యాచ్ ఆడనుంది. ఆదివారం మెల్‌బోర్న్ వేదికగా దాయాదితో తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిచేందుకు తాము ప్రశాంతంగా ఉంటామని రోహిత్ తెలిపాడు.
ప్రతిసారీ బ్లాక్‌బస్టరే
'ఇదే జరుగుతుందని మాకు తెలుసు. మేం ఎప్పుడు పాకిస్థాన్‌తో ఆడినా బ్లాక్‌బస్టరే అవుతుంది. జనాలు బయటకు వచ్చి మ్యాచ్‌ను వీక్షిస్తూ ఆ వాతావరణాన్ని ఆస్వాదించాలని కోరుకుంటారు. అలాగే క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తారు. అయితే స్టేడియంలో ఎలాంటి ఉత్సాహం, థ్రిల్ ఉంటుందో తెలిసిందే. ఆటగాళ్లకూ ఇదో గొప్ప మ్యాచ్. పాక్ పోరుతో మేం క్యాంపెయిన్ ఆరంభిస్తున్నాం. అదే సమయంలో మేం ప్రశాంతంగా ఉంటాం. అలా ఉంటేనే మేం కోరుకున్న ఫలితం వస్తుంది' అని రోహిత్ చెప్పాడు.
కెప్టెన్సీ ఎక్సైటింగ్
ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు సారథ్యం వహించడం ఎక్సైటింగ్‌గా అనిపిస్తోందని హిట్‌మ్యాన్ తెలిపాడు. వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో రెండు ప్రాక్టీస్ మ్యాచులతో ఆటగాళ్లు ఆస్ట్రేలియా పరిస్థితులకు అలవాటు పడ్డారని వెల్లడించాడు. 'ఇదో గొప్ప ఫీలింగ్. మేం ఆసీస్, దక్షిణాఫ్రికాపై సిరీసులు గెలిచి ఇక్కడికొచ్చాం. నిజమే, అవి ఉపఖండంలో గెలిచినవే. ఆస్ట్రేలియాలో భిన్నమైన సవాళ్లు ఉంటాయి. అందుకే ఈ పరిస్థితులకు అలవాటు పడటం ముఖ్యం. కొందరైతే అంతకు ముందెప్పుడూ ఆసీసుకు రాలేదు. దాంతో మేం ముందుగానే ఇక్కడికొచ్చాం. ఏదేమైనా ఆటగాళ్లంగా ఉత్సాహంగా ఉన్నారు' అని అతడు పేర్కొన్నాడు.