T20 World Cup 2022 Rain Affect: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు వరుణ దేవుడు ఈ సారి వరుస షాకులు ఇస్తున్నాడు! మెగా టోర్నీలో అత్యంత కీలక మ్యాచులను వర్షార్పణం చేసేలా ఉన్నాడు. ఆస్ట్రేలియాలో మరికొన్ని రోజులు లానినా ఎఫెక్ట్‌ ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. భారత్‌-పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ మ్యాచులకు 90 శాతం వరకు వానగండం పొంచివుందని తెలిసింది.






ఆస్ట్రేలియా x న్యూజిలాండ్‌ డౌటే!


టీ20 ప్రపంచకప్‌లో శనివారం నుంచి సూపర్‌ 12 మ్యాచులు మొదలవుతాయి. అదే రోజు సిడ్నీ వేదికగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా పొరుగు దేశం న్యూజిలాండ్‌తో తలపడనుంది. అంతర్జాతీయ క్రికెట్లో ఈ రెండు జట్ల మధ్య రైవల్రీ ఉంది. దీనిని ట్రాన్స్‌ టాస్మేనియన్‌ రైవల్రీ అంటారు. శనివారం సిడ్నీలో 80 శాతం వరకు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. సాయంత్రం 1-3 మిల్లీమీటర్ల మేర వర్షం వస్తుందని అంచనా వేసింది. శుక్రవారం మధ్యాహ్నం, సాయంత్రం ఇక్కడ 90 శాతం మేర జల్లుల పడతాయని వెల్లడించింది. అదే జరిగితే ఔట్‌ఫీల్డ్‌ చిత్తడిగా మారుతుంది.


భారత్‌ x పాకిస్థాన్‌పై సందిగ్ధం!


ఆదివారం దాయాదుల సమరం జరగుతుంది. మెల్‌బోర్న్‌ వేదికగా భారత్, పాక్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచునూ వరుణుడు వెంటాడుతున్నాడు. ఆదివారం వర్షం కురిసే అవకాశాలు 90 శాతం ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. 10-25 మి.మీ. వర్షపాతం ఉంటుందని తెలిపింది. టీ20 ప్రపంచకప్‌లో లీగు మ్యాచులకు రిజర్వు డేలు లేవు.  ఒకవేళ భారీ వర్షం కురిస్తే కనీసం 5 ఓవర్ల మ్యాచులైన ఆడించాలని నిర్వాహకులు భావిస్తున్నారు.


తీవ్రంగా లానినా ఎఫెక్ట్‌!


ప్రస్తుతం లానినా ఎఫెక్ట్‌ తూర్పు, ఆగ్నేయ ఆస్ట్రేలియాపై ఎక్కువగా ఉంది. మెల్‌బోర్న్‌, సిడ్నీ, హోబర్ట్‌ వేదికలు ఇక్కడే ఉన్నాయి. పశ్చిమం వైపు ఇబ్బంది లేదని తెలిసింది. పెర్త్‌లో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా మ్యాచులపై వర్షం ప్రభావం లేదు. బ్రిస్బేన్‌, అడిలైడ్‌పై ఎక్కువగా ఉంది. దీనిని బట్టి చూస్తే ఈ టీ20 ప్రపంచకప్‌లో వర్షమే కీలకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బుధవారం గబ్బాలో జరగాల్సిన భారత్‌, న్యూజిలాండ్‌ వార్మప్‌ మ్యాచ్‌ ఒక్క బంతైనా పడకుండా రద్దైంది.