T20 WC 2022: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2022లో టీమ్‌ఇండియా రెండో వార్మప్‌ మ్యాచ్‌కు సిద్ధమైంది. ప్రమాదకరమైన న్యూజిలాండ్‌తో తలపడనుంది. బ్రిస్బేన్‌లోని గబ్బా ఇందుకు వేదిక. ఈ మ్యాచ్‌కు సంబంధించి ఓ కీలక అప్‌డేట్‌ వచ్చింది. మిస్టర్‌ 360 సూర్యకుమార్‌ యాదవ్‌ కివీస్‌పై ఆడటం లేదు!




కీలకమైన సూపర్‌ 12కు ముందు ప్రధాన జట్లు వార్మప్‌ మ్యాచులు ఆడుతున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి ప్రాక్టీస్‌ గేమ్‌లో టీమ్‌ఇండియా థ్రిల్లింగ్‌ విక్టరీ అందుకుంది. ఆఖరి ఓవర్లో షమి 3 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ హాఫ్ సెంచరీలతో రాణించారు. బుధవారం మధ్యాహ్నం 1:30 గంటలకు భారత్‌, న్యూజిలాండ్‌ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌ రెండు జట్లకూ కీలకం. మెగా టోర్నీకి ముందు తమ జట్ల సన్నద్ధత, సమతూకం పరీక్షించుకొనేందుకు ఇదే చివరి అవకాశం.


మిస్టర్‌ 360, సూపర్‌ ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌కు విశ్రాంతినివ్వాలని టీమ్‌ఇండియా నిర్ణయించుకుంది. పాకిస్థాన్‌ పోరుకు అతడిని తాజాగా ఉంచాలని భావిస్తోంది. ఏడాది కాలంగా సూర్య ఎడతెరపి లేకుండా సిరీసులు ఆడుతున్నాడు. ఐపీఎల్‌ 2022 తర్వాత దాదాపుగా అన్ని సిరీసుల్లో ఆడాడు. కాగా అతడి స్థానంలో దీపక్‌ హుడాను ఆడిస్తారని సమాచారం. రిషభ్ పంత్‌ను పరీక్షించే అవకాశాలూ ఉన్నాయి. ఒకవేళ ఇద్దరినీ ఆడించేందుకు విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్, రోహిత్ శర్మలో ఒకరికి విశ్రాంతినివ్వొచ్చని తెలిసింది.




మరోవైపు న్యూజిలాండ్‌ ఈ మ్యాచును సీరియస్‌గా తీసుకుంటోంది. కీలక ఆటగాళ్లందరినీ ఆడించనుంది. ఎందుకంటే తొలి వార్మప్‌ మ్యాచులో దక్షిణాఫ్రికా చేతిలో కివీస్‌ ఘోర పరాజయం చవిచూసింది. కేవలం 98కే ఆలౌటైంది. పైగా వీళ్లున్న గ్రూపులో బలమైన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, డేంజరస్‌ అఫ్గానిస్థాన్‌ వంటి దేశాలు ఉన్నాయి.


భారత జట్టు: రోహిత్ శర్మ, కేఎల్‌ రాహుల్‌ / దీపక్‌ హుడా, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌/ రిషభ్ పంత్‌, హార్దిక్‌ పాండ్య, దినేశ్‌ కార్తీక్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, యుజ్వేంద్ర చాహల్‌, అర్షదీప్‌ సింగ్‌, హర్షల్‌ పటేల్‌, మహ్మద్‌ షమి