T20 World Cup 2022: టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ రిషభ్ పంత్‌కు (Rishabh Pant) షాక్‌! జట్టు యాజమాన్యం అతడిపై విశ్వాసం కోల్పోయిందని సమాచారం. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగే తొలి మ్యాచులో అతడిని తీసుకోరని తెలిసింది. మిగిలిన మ్యాచుల్లోనూ అతడిని తీసుకొనే అవకాశాలు తక్కువే! దినేశ్‌ కార్తీక్‌నే పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటారని అంటున్నారు.


మరో రెండు రోజుల్లో టీ20 ప్రపంచకప్‌ మొదలవుతుంది. మొదట చిన్న జట్లు ఫస్ట్‌ రౌండ్‌ మ్యాచులు ఆడతాయి. అక్టోబర్‌ 22 నుంచి సూపర్‌ 12 మ్యాచులు మొదలవుతాయి. టీమ్‌ఇండియా, పాకిస్థాన్‌ 23న తొలి మ్యాచులో తలపడతాయి. ఈ పోరులో రెండు జట్లు ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి. ఈ పోరులో తుది జట్టులో రిషభ్ పంత్‌కు అవకాశం ఇవ్వడం లేదని తెలిసింది.


వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాతో జరిగిన రెండు ప్రాక్టీస్‌ మ్యాచుల్లో రిషభ్ పంత్‌ ఇబ్బంది పడ్డాడు. ఎక్కువ పరుగులేం చేయలేదు. కేవలం 9 రన్సే సాధించాడు. ఇదే ఫాస్ట్‌ పిచ్‌లపై దినేశ్‌ కార్తీక్‌ సైతం ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. 2022లో డీకే 19 ఇన్నింగ్సుల్లో 181 బంతులు ఎదుర్కొని 273 పరుగులు చేశాడు. మరోవైపు పంత్‌ 17 ఇన్నింగ్సుల్లో 338 రన్స్‌ సాధించాడు. అయితే పంత్‌ స్ట్రైక్‌రేట్‌ 136 కాగా డీకేది 150గా ఉంది. పైగా ఫినిషర్‌ పాత్రలో అతడు రాణిస్తున్నాడు. అందుకే మేనేజ్‌మెంట్‌ పంత్‌తో పోలిస్తే డీకేనే నమ్ముకుంటోంది.


టీమ్‌ఇండియా త్వరలోనే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో రెండు అధికారిక వార్మప్‌ మ్యాచులు ఆడనుంది. ఇందులో డీకే, పంత్‌ ఇద్దరినీ ఆడించాలని రాహుల్‌ ద్రవిడ్‌, రోహిత్‌ శర్మ భావిస్తున్నారట. ఈ మ్యాచుల్లో ఎవరు బాగా ఆడితే వారికే ఎక్కువ అవకాశాలు ఇవ్వాలన్నది ప్రణాళిక. వీటిలో ప్రదర్శనను బట్టే మిగతా లీగు మ్యాచుల్లో పంత్ భవిష్యత్తు ఆధారపడి ఉంది.


టీమ్‌ఇండియా జట్టు: రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హుడా, రిషభ్ పంత్‌, దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్య, రవిచంద్రన్‌ అశ్విన్‌, యుజ్వేంద్ర చాహల్‌, అక్షర్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, హర్షల్‌ పటేల్‌, అర్షదీప్‌ సింగ్‌, మహ్మద్ షమి


స్టాండ్‌ బై: శ్రేయస్‌ అయ్యర్‌, రవి బిష్ణోయ్‌, మహ్మద్‌ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌