Aakash Chopra On KL Rahul:  ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) అత్యధిక పరుగులు చేస్తాడని ఆకాశ్ చోప్రా అంచనా వేశాడు. మంచి బౌన్స్‌, పేస్‌కు సహరించే ఆస్ట్రేలియా పిచ్‌లు అతడి బ్యాటింగ్‌ స్టైల్‌కు నప్పుతాయని పేర్కొన్నాడు. బంతి చక్కగా బ్యాటు మీదకు వస్తుందన్నాడు. జస్ప్రీత్‌ బుమ్రా లేకపోవడంతో బౌలింగ్‌లో అర్షదీప్‌ సింగ్‌ కీలకంగా మారుతాడని వెల్లడించాడు.


మరో రెండు రోజుల్లో ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఆరంభం అవుతోంది. మొదట చిన్న జట్లు ఆడతాయి. అందులో అగ్రస్థానంలో నిలిచిన జట్లు మెయిన్‌ డ్రాకు క్వాలిఫై అవుతాయి. మొత్తం 12 జట్లు సూపర్‌ 12 ఆడతాయి. కాగా టీమ్‌ఇండియా ఆటగాళ్ల ప్రదర్శన గురించి ఆకాశ్ చోప్రా విశ్లేషించాడు.


'టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా తరఫున కేఎల్‌ రాహుల్‌ టాప్‌ స్కోరర్‌ అవుతాడు. అతడికి 20 ఓవర్లు పూర్తిగా ఆడే అవకాశం దొరుకుతుంది. చివరి బంతి వరకు ఆడే సామర్థ్యం అతడికి ఉంది. బంతి చక్కగా బ్యాటు మీదకు వచ్చే ఇలాంటి పిచ్‌లు అతడి శైలికి నప్పుతాయి' అని ఆకాశ్ చోప్రా అన్నాడు. బౌలింగ్‌ విషయానికి వస్తే అర్షదీప్‌ సింగ్‌ కీలకం అవుతాడని అంచనా వేశాడు. ఆరంభం, ఆఖరి ఓవర్లలోనే కాకుండా మధ్యలోనూ అతడికి బంతినిచ్చే అవకాశం ఉందన్నాడు.



'నేనైతే అర్షదీప్‌ సింగ్‌ కీలకం అవుతాడని నమ్ముతున్నా. అతడు కొత్త బంతితో అలాగే ఆఖరి ఓవర్లలో బౌలింగ్‌ చేస్తాడు. మిడిల్‌ ఓవర్లలోనూ అతడికి బంతినిచ్చే అవకాశం లేకపోలేదు. ఆస్ట్రేలియాలోని పెద్ద మైదానాలను అతడు ఇష్టపడతాడు' అని ఆకాశ్ అన్నాడు. 'ప్రపంచంలోని అత్యుత్తమ జట్టుగా మీరు భావిస్తే, మంచి డెప్త్‌ ఉంటే, ప్రపంచంలోనే బెస్ట్‌ లీగ్‌ మీదే అనుకుంటే టీ20 ప్రపంచకప్‌ గెలిచేందుకు ఫేవరెట్లు మీరే' అని టీమ్‌ఇండియా గురించి చెప్పాడు.