IND vs WA XI: వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాతో జరిగిన రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఘోర పరాజయం చవిచూసింది. బౌన్సీ, పేస్‌ పిచ్‌పై ఛేదనలో విఫలమైంది. 169 పరుగుల లక్ష్య ఛేదనలో 36 తేడాతో ఓటమి పాలైంది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (74; 55 బంతుల్లో 9x4, 2x6) అర్ధశతకం వృథా అయింది. హార్దిక్‌ పాండ్య (17) రెండో టాప్‌ స్కోరర్‌. అంతకు ముందు ప్రత్యర్థి జట్టులో నిక్‌ హబ్సన్‌ (64; 41 బంతుల్లో 5x4, 4x6), డీఆర్సీ షార్ట్‌ (52; 38 బంతుల్లో 4x4, 2x6) హాఫ్‌ సెంచరీలు సాధించారు.




రాహుల్‌ సమయోచిత ఇన్నింగ్స్‌


విపరీతమైన వేగం, బౌన్స్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై టీమ్‌ఇండియా తడబడింది. ప్రత్యర్థి బౌలర్ల బంతులకు బ్యాటర్లు విలవిల్లాడారు. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ ఒక్కడే నిలకడగా బ్యాటింగ్‌ చేశాడు. పేస్‌కు ఇబ్బంది పడ్డ ఓపెనర్‌ రిషభ్ పంత్‌ (9; 11 బంతుల్లో)ను జట్టు స్కోరు 21 వద్దే బెరెన్‌డార్ఫ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మరికాసేపటికే దీపక్ హుడా (6)ను మోరిస్‌ పెవిలియన్‌ పంపించాడు. ఎదురుదాడికి ప్రయత్నించిన హార్దిక్‌ పాండ్య (17; 9 బంతుల్లో 2x6)ను మెక్‌కెన్జీ ఔట్‌ చేశాడు. అక్షర్‌ పటేల్‌ (2; 7 బంతుల్లో)ను సైతం మోరిసే పెవిలియన్‌కు చేర్చడంతో 79కే టీమ్‌ఇండియా 4 వికెట్లు చేజార్చుకుంది. దినేశ్‌ కార్తీక్‌ (10), హర్షల్‌ పటేల్‌ (2) సైతం విఫలమయ్యారు. మరోవైపు ఆచితూచి ఆడిన రాహుల్‌ 18 ఓవర్లో భారీ షాట్లు ఆడాడు. జట్టును గెలిపించేందుకు ప్రయత్నం చేశాడు. 18.2వ బంతికి అతడిని ఆండ్రూ టై చేయడంతో ఓటమి ఖరారైంది.




110 రన్స్‌ పార్ట్‌నర్‌ షిప్‌


తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 15 వద్దే ఓపెనర్‌ జోస్‌ ఫిలిప్‌ (8)ను అర్షదీప్‌ ఔట్‌ చేశాడు. అయితే మరో ఓపెనర్‌ డీఆర్సీ షార్ట్‌, నిక్ హబ్సన్‌ టీమ్‌ఇండియా బౌలర్లకు చుక్కలు చూపించారు. సొంత మైదానం పరిస్థితుల్లో మెరుగ్గా రాణించారు. భారీ సిక్సర్లు, బౌండరీలు దంచుతూ రెండో వికెట్‌కు 110 పరుగుల భాగస్వామ్యం అందించారు. జట్టు స్కోరు 125 వద్ద హబ్సన్‌ను హర్షల్‌ ఔట్‌ చేశాడు. మరో రెండు పరుగులకే డీఆర్సీ షార్ట్‌ రనౌట్‌ అయ్యాడు. అశ్విన్‌ బరిలోకి దిగి 3 వికెట్లు పడగొట్టడంతో ఆ తర్వాత  మాథ్యూ కెల్లీ (15నాటౌట్‌) మినహా ఎవరూ రెండంకెల స్కోరు చేయలేదు. 20 ఓవర్లకు వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా 168-8తో నిలిచింది. ఈ మ్యాచులో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ఫీల్డింగ్‌ చేసినప్పటికీ బ్యాటింగ్‌కు రాలేదు.