T20 WC 2022: టీ20 ప్రపంచకప్ లో హిస్టరీ రిపీటైంది. అదేంటి? ఇంకా 2022 సెమీఫైనల్స్ మ్యాచులు కూడా మొదలవలేదు. ఏ జట్టు కప్ గెలుస్తుందో తెలియదు. మరి ఏ హిస్టరీ రిపీట్ అయ్యిందనుకుంటున్నారా! అదేనండీ ఇప్పటివరకు పొట్టి కప్పునకు ఆతిథ్యమిచ్చిన ఏ దేశం కూడా ట్రోఫీ అందుకోలేదు. ఇదే చరిత్ర ప్రస్తుత మెగా టోర్నీలోనూ పునరావృతమైంది. 


టీ20 ప్రపంచకప్ మొదలయ్యి ఈ ఏడాదితో 15 సంవత్సరాలు. ఎనిమిది సార్లు వివిధ దేశాలు ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమిచ్చాయి. అయితే ఆతిథ్యమిచ్చిన ఏ జట్టూ కప్పును గెలుచుకోలేదు. అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన జట్టు దాన్ని నిలబెట్టుకోలేదు. ఈ ఏడాదీ అదే రిపీటైంది. 2021 లో పొట్టి కప్పును గెలుచుకున్న ఆస్ట్రేలియా ఈ ఏడాది మెగా టోర్నీకి ఆతిథ్యమిస్తోంది. అయితే ఆ జట్టు కప్పు గెలుచుకోవడం కాదు.. కనీసం సెమీస్ చేరలేకపోయింది. దీంతో చరిత్ర తిరగరాసే అవకాశం కోల్పోయింది. 


ఆతిథ్యం ఒకటి.. విజేత మరొకటి


2007 లో మొదలైన టీ20 ప్రపంచకప్ కు దక్షిణాఫ్రికా ఆతిథ్యమిచ్చింది. తొలి ఏడాది కప్పును ధోనీ సారథ్యంలోని టీమిండియా అందుకుంది. 2009లో ఇంగ్లండ్, 2010 లో వెస్టిండీస్, 2012లో శ్రీలంక, 2014 లో బంగ్లాదేశ్, 2016లో భారత్, 2021లో భారత్ (యూఏఈ, ఒమన్), 2022లో ఆస్ట్రేలియా పొట్టి కప్పుకు ఆతిథ్యమిచ్చాయి. అయితే ఇందులో ఆతిథ్యమిచ్చిన ఏ జట్టూ కప్పును అందుకోలేదు. 


టీ20 ప్రపంచకప్ ను అత్యధికంగా వెస్టిండీస్ రెండు సార్లు గెలుచుకుంది. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఒక్కో కప్పును అందుకున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో విజేత ఎవరో తేలాల్సి ఉంది. 



టీ20 ప్రపంచకప్ 2022


ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో గ్రూప్- 1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్.. గ్రూప్- 2 నుంచి భారత్, పాకిస్థాన్ సెమీఫైనల్స్ కు చేరుకున్నాయి. నవంబర్ 9న న్యూజిలాండ్- పాకిస్థాన్ సెమీఫైనల్ మ్యాచ్ ఆడతాయి. తర్వాతి రోజు భారత్, ఇంగ్లండ్ తో తలపడుతుంది. ఈ రెండు మ్యాచుల్లో విజయం సాధించిన జట్లు ఫైనల్ లో కప్పు కోసం పోటీపడతాయి. ఇదివరక్ భారత్, పాకిస్థాన్, ఇంగ్లండ్ పొట్టి కప్పును అందుకున్నాయి. న్యూజిలాండ్ ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్ గెలవలేదు.