జింబాబ్వేతో జరుగుతున్న చివరి సూపర్-12 మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ చెలరేగారు. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగుల భారీ స్కోరు సాధించింది. సూర్యకుమార్ యాదవ్ (61 నాటౌట్: 25 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జింబాబ్వే విజయానికి 120 బంతుల్లో 187 పరుగులు కావాలి.


టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే భారత్‌కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. రోహిత్ శర్మ (15: 13 బంతుల్లో, రెండు ఫోర్లు) విఫలం కావడంతో భారత్ 27 పరుగులకే మొదటి వికెట్ కోల్పోయింది. అనంతరం మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (51: 35 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు), విరాట్ కోహ్లీ (26: 25 బంతుల్లో, రెండు ఫోర్లు) జట్టును ఆదుకున్నారు.


వీరిద్దరూ రెండో వికెట్‌కు 60 పరుగులు జోడించారు. ఈ దశలో విరాట్ కోహ్లీని అవుట్ చేసిన షాన్ విలియమ్స్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. సిక్సర్‌తో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న కేఎల్ రాహుల్ కూడా వెంటనే అవుటయ్యాడు. దినేష్ కార్తీక్ స్థానంలో జట్టులోకి వచ్చిన రిషబ్ పంత్ (3: 5 బంతుల్లో) ఈ మ్యాచ్‌లో విఫలం అయ్యాడు. లాంగాన్‌లో ర్యాన్ బుర్ల్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌తో పంత్ వెనుదిరిగాడు.


ఇక ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (61 నాటౌట్: 25 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) జట్టును ఆదుకున్నాడు. బౌండరీలు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. హార్దిక్ పాండ్యా (18: 18 బంతుల్లో, రెండు ఫోర్లు) వేగంగా ఆడకపోయినా తనకు సహకారం అందించాడు. దీంతో టీమిండియా 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగుల భారీ స్కోరును సాధించింది.