T20 WC Semi-Finals: ఎన్నో ఏళ్ల నుంచి క్రికెట్ చూస్తున్నాం. టోర్నమెంట్ మొత్తం అద్భుతంగా ఆడతారు. కీలకమైన సమయం వచ్చేసరికి చేతులెత్తేస్తారు. చోకర్స్ అనే బిరుదుకు వీలైనంత న్యాయం చేస్తారు. ఎస్... ఇదంకా  సౌతాఫ్రికా గురించే. మరోసారి కీలక సమయంలో తడబడ్డారు. సూపర్-12 ఆఖరి మ్యాచ్ లో నెదర్లాండ్స్ చేతిలో ఓటమితో దక్షిణాఫ్రికా ఇంటిబాట పట్టింది. కేవలం ఈ మ్యాచ్ గెలిస్తే చాలు. వేరే ఏ సమీకరణాలతో సంబంధం లేకుండా దర్జాగా సెమీస్ కు వెళ్లేవారు. కానీ అలా చేయలేకపోయారు. 


నెదర్లాండ్స్ ఇచ్చిన 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 13 పరుగుల తేడాతో ఓడిపోయారు. సౌతాఫ్రికా ఓటమి ద్వారా భారత్ సెమీస్ కు అర్హత సాధించింది. జింబాబ్వేతో జరిగే మ్యాచ్ లో గెలుపోటములను బట్టి మొదటి లేదా రెండో స్థానమా అనేది ఖరారవుతుంది. 


దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన నెదర్లాండ్స్... ప్రోటీస్ బౌలింగ్ ను సమర్థంగా ఎదుర్కొంది. చాలా క్రమశిక్షణతో ఆడింది. కూపర్, మైబర్గ్, ఎకార్ మ్యాన్ రాణించారు. ఇక టోర్నమెంట్ మొత్తం ఆకట్టుకున్న డచ్ బౌలింగ్ విభాగం... మరోసారి మంచి ప్రదర్శన చేసింది. ముఖ్యంగా పేస్ బౌలర్లు బ్రాండన్ గ్లోవర్, బస్ డీ లీడ్, ఫ్రెడ్ క్లాసెన్ సౌతాఫ్రికా బ్యాటర్ల పని పట్టారు. ఇప్పటికే ఓ సెమీస్ బర్త్ ను టీమిండియా ఖాయం చేసుకోగా... పాక్-బంగ్లా మ్యాచ్ విజేత రెండో బెర్త్ ను సొంతం చేసుకుంటారు.