టీ20 ప్రపంచకప్ సూపర్-12 దశను టీమిండియా భారీ విజయంతో ముగించింది. ఆదివారం జింబాబ్వేతో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో భారత్ 71 పరుగులతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా  20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. అనంతరం జింబాబ్వే 17.2 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ 71 పరుగులతో విజయం సాధించింది. గ్రూప్-2లో మొదటి స్థానంలో నిలిచింది. దీంతో నవంబర్ 10వ తేదీన జరిగిన రెండో సెమీస్‌లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది. 


187 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే ఏ దశలోనూ గెలిచే ప్రయత్నం చేసినట్లు కూడా అనిపించలేదు. మొదటి బంతికే ఓపెనర్ వెస్లే మదెవెరెను (0: 1 బంతి) భువీ అవుట్ చేశాడు. ఆ తర్వాత రెండో ఓవర్లోనే వన్ డౌన్ బ్యాటర్ రెగిస్ చకాబ్వాను (0: 6 బంతుల్లో) కూడా అర్ష్‌దీప్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో జింబాబ్వే రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.


ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో సికందర్ రాజా (34: 24 బంతుల్లో, మూడు ఫోర్లు), ర్యాన్ బుర్ల్ (35: 22 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) మినహా ఇంకెవరూ రాణించలేదు. దీంతో జింబాబ్వే 17.2 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో అశ్విన్ అత్యధికంగా మూడు వికెట్లు తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీలకు రెండేసి వికెట్లు దక్కగా, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్‌లు తలో వికెట్ పడగొట్టారు.


అంతకు ముందు టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే భారత్‌కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. రోహిత్ శర్మ (15: 13 బంతుల్లో, రెండు ఫోర్లు) విఫలం కావడంతో భారత్ 27 పరుగులకే మొదటి వికెట్ కోల్పోయింది. అనంతరం మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (51: 35 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు), విరాట్ కోహ్లీ (26: 25 బంతుల్లో, రెండు ఫోర్లు) జట్టును ఆదుకున్నారు.


వీరిద్దరూ రెండో వికెట్‌కు 60 పరుగులు జోడించారు. ఈ దశలో విరాట్ కోహ్లీని అవుట్ చేసిన షాన్ విలియమ్స్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. సిక్సర్‌తో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న కేఎల్ రాహుల్ కూడా వెంటనే అవుటయ్యాడు. దినేష్ కార్తీక్ స్థానంలో జట్టులోకి వచ్చిన రిషబ్ పంత్ (3: 5 బంతుల్లో) ఈ మ్యాచ్‌లో విఫలం అయ్యాడు. లాంగాన్‌లో ర్యాన్ బుర్ల్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌తో పంత్ వెనుదిరిగాడు.


ఇక ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (61 నాటౌట్: 25 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) జట్టును ఆదుకున్నాడు. బౌండరీలు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. హార్దిక్ పాండ్యా (18: 18 బంతుల్లో, రెండు ఫోర్లు) వేగంగా ఆడకపోయినా తనకు సహకారం అందించాడు. దీంతో టీమిండియా 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగుల భారీ స్కోరును సాధించింది.