Virat Kohli Fake Fielding: ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో విరాట్‌ కోహ్లీ హాట్‌ టాపిక్‌గా మారుతున్నాడు. టీమ్‌ఇండియా ఆడే ప్రతి మ్యాచులో అతడి హవా కొనసాగుతోంది. తిరుగులేని బ్యాటింగ్‌తో అదరగొడుతున్న అతడు ఇప్పుడు ఫేక్‌ ఫీల్డింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. తమ ఓటమికి కారణం విరాట్‌ ఫేక్‌ ఫీల్డింగేనని బంగ్లా ఆటగాడు నురుల్‌ హసన్‌ ఆరోపిస్తున్నాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఐదు పరుగులు తమ ఖాతాలో కలవాల్సిందని పేర్కొన్నాడు. ఇంతకీ ఏం జరిగింది?




బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్లో ఈ సంఘటన జరిగింది. అక్షర్‌ పటేల్‌ వేసిన రెండో బంతికి లిటన్‌ దాస్‌ రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. అదే సమయంలో అంతర్‌ వృత్తంలో ఉన్న విరాట్‌ కోహ్లీ బంతిని కీపర్‌ వైపు విసురుతున్నట్టు సిగ్నల్స్‌ ఇచ్చాడు. నిజానికి ఆ బంతి ఫైన్‌లెగ్‌ లోకి వెళ్లింది. అర్షదీప్‌ సింగ్‌ దానిని నాన్‌ స్ట్రైకర్‌ వైపు విసిరాడు. అప్పుడెవరూ ఈ విషయం పట్టించుకోలేదు. ఓటమి తర్వాత బంగ్లా ఆటగాళ్లు దీనిని లేవనెత్తారు.


'మైదానం చిత్తడిగా ఉంది. కచ్చితంగా ఇది ప్రభావం చూపించింది. ప్రతి ఒక్కరూ దీనిని గమనించారు. ఇంకా మేం ఫేక్‌ ఫీల్డింగ్‌ గురించి మాట్లాడుతున్నాం. దీంతో టీమ్‌ఇండియాకు ఐదు పరుగుల పెనాల్టీ పడేది. మాకు విజయం లభించేది. కనీసం అదీ కలిసిరాలేదు' అని నురుల్‌ అన్నాడు.




కామెంటేటర్‌ హర్షాభోగ్లే సైతం ఫేక్‌ ఫీల్డింగ్‌ ఘటనపై స్పందించాడు. 'నిజమేంటంటే ఈ సంఘటనను ఎవరూ గమనించలేదు. అంపైర్లు, బ్యాటర్లు, కామెంటేటర్లు ఎవరూ గమనించలేదు. ఐసీసీ 41.5 నిబంధన ప్రకారం ఫీల్డింగ్‌ జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ వేస్తారు. కానీ ఎవ్వరూ చూడలేదు. అలాంటప్పుడు ఎవరేం చేయగలరు!' అని హర్ష అన్నాడు.


'మైదానం చిత్తడిగా ఉందని ఎవరూ ఫిర్యాదు చేయరనే అనుకుంటున్నా. బ్యాటింగ్‌ జట్టుకు అనుకూలంగా ఉందని షకిబ్‌ అన్నది నిజమే. అంపైర్లు, క్యూరేటర్లు మొత్తం మ్యాచ్‌ కొనసాగేందుకు ప్రయత్నించారు. కొద్ది సమయమే వృథా అవ్వడంతో వారు మెరుగ్గానే స్పందించారు. అందుకే బంగ్లా మిత్రులకు చెప్పేదొక్కటే. ఫేక్‌ ఫీల్డింగ్‌, చిత్తడి మైదానాలను ఓటమి కారణాలుగా భావించొద్దు. ఏ ఒక్క బ్యాటర్‌ నిలబడ్డా బంగ్లా గెలిచేదే' అని ఆయన ట్వీట్‌ చేశాడు.