ICC T20I Rankings: టీమిండియా సంచలన బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన రికార్డును అందుకున్నాడు. అద్భుత ఫామ్ లో ఉన్న సూర్య టీ20ల్లో నెంబర్ 1
బ్యాటర్ గా అవతరించాడు. ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న పాక్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ రెండో స్థానానికి పడిపోయాడు. బంగ్లాతో మ్యాచులో 16 బంతుల్లో 30 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ తో సూర్య ర్యాంకింగ్స్ లో తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు.
బుధవారం ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో 863 పాయింట్లతో సూర్యకుమార్ నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. 842 పాయింట్లతో రిజ్వాన్ రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ తర్వాత టీ20ల్లో నెంబర్ 1 బ్యాటర్ గా స్థానం సాధించిన భారత ఆటగాడిగా సూర్య నిలిచాడు. 2014లో తొలిసారి నెంబర్ 1 ర్యాంకును అందుకున్న కోహ్లీ.. 1013 రోజులు ఆ స్థానంలో ఉన్నాడు. మరి సూర్య ఎన్ని రోజులు ఉంటాడో చూడాలి.
360 డిగ్రీల ప్లేయర్
గతేడాది మార్చిలో టీ20ల్లో అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్ అతి తక్కువ కాలంలోనే మేటి బ్యాటర్ గా ఎదిగాడు. మైదానంలో నలుమూలలా అద్భుతమైన షాట్లు కొడుతూ ఇండియన్ 360 డిగ్రీ ప్లేయర్ గా గుర్తింపు పొందాడు. పిచ్ పరిస్థితులతో సంబంధం లేకుండా క్రీజులోకి వచ్చీరావడంతోనే భారీ షాట్లు కొట్టడం సూర్య ప్రత్యేకత. క్రీజులో అతనున్నంతసేపు స్కోరు బోర్డు పరుగులు పెడుతూనే ఉంటుంది. ఇప్పటివరకు 37 మ్యాచులు ఆడిన సూర్య ఒక శతకం, 11 అర్థశతకాలతో అదరగొట్టాడు. ఈ క్రమంలోనే నెంబర్ వన్ బ్యాటర్ గా అవతరించాడు.
బంగ్లాపై విజయం
టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. అనంతరం వర్షం కారణంగా బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 16 ఓవర్లలో 151 పరుగులకు కుదించారు. అయితే బంగ్లాదేశ్ ఆరు వికెట్ల నష్టానికి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో టీమిండియా ఐదు పరుగులతో విజయం సాధించింది. ఈ విజయంతో తిరిగి భారత్ టేబుల్ టాపర్‌గా నిలిచింది. అర్థ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.