Litton Das Run Out: బంగ్లాదేశ్ తో భారత్ మ్యాచ్. బంగ్లా గెలవాలంటే 185 పరుగులు చేయాలి. మబ్బులు పట్టిన వాతావరణం. వర్షం ముప్పును ముందే పసిగట్టిన ఆ జట్టు తెలివిగా ఆలోచించింది. ఎదురుదాడే లక్ష్యంగా ఓపెనర్ లిటన్ దాస్ కు మార్గనిర్దేశం చేసి పంపించింది. జట్టు కోరుకున్నట్లే భారత బౌలర్లపై పిడుగులా పడిపోయాడు లిటన్ దాస్. షమీ, భువీ, అర్షదీప్ ఎవరైతే నాకేంటీ అన్నట్లుగా బాదుడే పనిగా పెట్టుకున్నాడు. అతని ధాటికి భారత్ పవర్ ప్లే 6 ఓవర్లలో 60 పరుగులు సమర్పించుకుంది. మరొక ఓవర్ ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది బంగ్లా. అయితే.. 


అదే టర్నింగ్ పాయింట్


ఆ దశలో మొదలైంది వర్షం. వర్షం తగ్గకుంటే గెలుపు బంగ్లా పులులదే. ఎందుకంటే డక్ వర్త్ లూయిస్ ప్రకారం అప్పటికి 17 పరుగుల ఆధిక్యంలో ఉంది ఆ జట్టు. అయితే గంట తర్వాత వరుణుడు శాంతించాడు. తిరిగి మొదలైంది ఆట. విరామం తర్వాత 9 ఓవర్లలో 85 పరుగులు అవసరమయ్యాయి బంగ్లాదేశ్ కు. లిటన్ ఊపు చూస్తే అదేమంత పెద్ద టార్గెట్ అనిపించలేదు. అప్పుడే జరిగింది మ్యాచును మలుపు తిప్పిన ఘటన.


బుల్స్ ఐ


 అశ్విన్ విసిరిన బంతిని కవర్స్ వైపుగా ఆడిన శాంటో ఒక పరుగు తీసి రెండో పరుగుకు ప్రయత్నించాడు. బంతిని అందుకున్న కేఎల్ రాహుల్ అంత దూరం నుంచి గురిచూసి వికెట్లకు కొట్టాడు. అంతే.. మైదానంలోని ఆటగాళ్లతో పాటు స్టేడియంలో కూర్చున్న అభిమానుల ఆనందం అంబరాన్నంటింది. కారణం ప్రమాదకర లిటన్ దాస్ రనౌట్ రూపంలో వెనుదిరగడమే. మ్యాచ్ లో అదే టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన బంగ్లా విజయానికి 5 పరుగుల దూరంలో ఆగిపోయింది. గెలిచిన భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.