Virat Kohli Record: గత కొన్నాళ్లుగా పేలవ ఫామ్ తో ఇబ్బంది పడిన పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ఆసియా కప్ తో ఫాంలోకి వచ్చాడు. అదే ఊపును ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ లోనూ కొనసాగిస్తున్నాడు. మెగా టోర్నీలో ఇప్పటివరకు భారత్ ఆడిన 4 మ్యాచుల్లో 3 అర్థ శతకాలతో చెలరేగిన కోహ్లీ.. అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 


ఐసీసీ టీ20 ప్రపంచకప్ మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ అవతరించాడు. బంగ్లాతో మ్యాచులో 16 పరుగుల వద్ద విరాట్ ఈ ఫీట్ ను అందుకున్నాడు. మెగా టోర్నీల్లో కోహ్లీ ఇప్పటివరకు 1,065 పరుగులు చేశాడు. దీంతో ఇప్పటివరకు మొదటి స్థానంలో ఉన్న శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే (1016)ను వెనక్కు నెట్టాడు. జయవర్ధనే 31 ఇన్నింగ్సుల్లో ఈ ఘనత సాధిస్తే.. కింగ్ కోహ్లీ కేవలం 25 ఇన్నింగ్సుల్లోనే ఈ ఫీట్ ను అందుకోవడం విశేషం. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ లో 220 పరుగులతో  అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో విరాట్ అగ్రస్థానంలో ఉన్నాడు. 



రెండున్నరేళ్లుగా ఇబ్బందులు


గత రెండున్నరేళ్లుగా విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ తో ఇబ్బంది పడ్డాడు. ఈ కాలంలో ఒక్క సెంచరీ కూడా కొట్టలేకపోయాడు. అడపాదడపా అర్థ శతకాలు సాధిస్తున్నా.. తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. సాధికారికంగా ఆడలేక తక్కువ స్కోర్లకే అవుటయ్యాడు. ఒకానొక దశలో జట్టులో స్థానమే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి వచ్చింది. అలాంటి స్థితిలో ఒక నెల ఆటకు విరామం తీసుకున్నాడు. 


అనంతరం జరిగిన ఆసియా కప్ లో రాణించాడు. అఫ్ఘనిస్థాన్ పై సెంచరీ చేసి దాదాపు మూడేళ్ల శతక నిరీక్షణకు తెరదించాడు.  అయినప్పటికీ మునుపటి సాధికారికత అతని బ్యాటింగ్ లో కనిపించలేదు. అయితే ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో మాత్రం పాత కోహ్లీని తలపిస్తున్నాడు. క్రీజులో స్వేచ్ఛగా కదలడం, బ్యాటింగ్ లో సాధికారికత, షాట్లలో కచ్చితత్వంతో కింగ్ కోహ్లీ పూర్తిగా ఫాంలోకి వచ్చేశాడు. ఈ క్రమంలోనే మెగా టోర్నీల్లో అత్యధిక పరుగుల వీరుడిగా అవతరించాడు. విరాట్ ఇదే జోరు చూపిస్తే పొట్టి కప్పును భారత్ తన ఖాతాలో వేసుకోవడం ఖాయం.